పిఠాపురం నియోజకవర్గాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దటానికి జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ తనదైన మార్గంలో వెళ్తున్నారు. ముందుగా ఓ యాక్షన్ ప్లాన్ రెడీ చేసుకున్నారు. అసలు సమస్యలు గుర్తించడం.. వాటిని పరిష్కరించేందుకు ఏమేం చేయాలో మార్గాలు సిద్ధం చేయడం.. చివరిగా పరిష్కారానికి సన్నాహాలు చేయడం. పిఠాపురం కోసం పవన్ కల్యాణ్ ప్రత్యేకంగా ఓ బృందాన్ని పవన్ నియమించుకున్నారు,. వారు ఎప్పటికప్పుడు పవన్ కు రిపోర్టులు ఇస్తున్నారు.
తాజాగా 21 మంది జిల్లా స్థాయి అధికారులు ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. పిఠాపురం నియోజకవర్గంలో మొత్తం 52 గ్రామాలు, రెండు మున్సిపాలిటీలు ఉన్నాయి. ఈ అన్ని చోట్లా జిల్లా స్థాయి అధికారులతో ఏర్పాటైన ప్రత్యేక బృందాలు క్షేత్రస్థాయిలో పర్యటించి సమస్యలను అధ్యయనం చేస్తాయి. పూర్తి స్థాయి యాక్షన్ ప్లాన్ తో నివేదికను సిద్ధం చేస్తాయి. వాటిని డిప్యూటీ సీఎంకు సమర్పిస్తారు.
సమస్యల పరిష్కరం అంటే అన్నీ డబ్బుతో ముడిపడి ఉండవు. కొన్ని సమస్యలకు మాత్రమే నిధులు అవసరం అవుతాయి. మెజార్టీ సమస్యలకు ప్రభుత్వ రిసోర్సెస్ సరిపోతాయి. అధికారుల నిర్లక్ష్యం, ఉద్యోగులు పని చేయకపోవడం వల్ల ఎక్కువ సమస్యలు పేరుకుపోతాయి. ఇలాంటి సమస్యలను తక్షణం పరిష్కరించేందుకు రోడ్ మ్యాప్ రెడీ చేయనున్నారు. పిఠాపురం విషయంలో పవన్ కల్యాణ్ చాలా క్లారిటీగా ఉన్నారని జనసేన వర్గాలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి.