జనసేన పార్టీకి కేవలం ఉత్తరాంధ్ర మరియు కోస్తాంధ్రలో మాత్రమే ఉనికి ఉంటుందని, రాయలసీమ ప్రాంతంలో పెద్దగా స్పందన లభించిందని ఊహించిన వారి అంచనాలు తలకిందులు చేస్తూ పవన్ కళ్యాణ్ రాయలసీమ పర్యటన దిగ్విజయంగా కొనసాగుతోంది.
నిన్న కర్నూల్ లో జరిగిన ర్యాలీలో వేలాదిగా జనం పాల్గొనగా, కొండారెడ్డి బురుజు వద్ద జరిగిన భారీ బహిరంగసభకు రెండు లక్షలకు పైగా జనం హాజరయ్యారు. ఇవాళ ఆదోని మార్కెట్ యార్డులో రైతులతో పవన్ కళ్యాణ్ సమావేశం జరిగింది. ఇక్కడ కూడా అదే సీన్ రిపీట్ అయ్యింది. ఆదోని పరిసర ప్రాంతాల నుండి దాదాపు రెండు వందల గ్రామాల నుంచి రైతులు హాజరయ్యారు. పత్తి రైతుల సమస్యలు వింటూ వారితో పవన్ కళ్యాణ్ చర్చాగోష్టి కొనసాగిస్తూ ఉండగా జనం మార్కెట్ యార్డుకు విపరీతంగా తరలివచ్చారు. స్థానిక సమాచారం మేరకు రెండు లక్షల నుంచి మూడు లక్షల మధ్యలో అభిమానులు పవన్ కళ్యాణ్ సభ జరుగుతున్న మార్కెట్ యార్డ్ వద్దకు వచ్చారు. అయితే ఇది బహిరంగ సభ కొరకు ఏర్పాటు చేసిన ప్రాంతం కాకపోవడం, మార్కెట్ యార్డులో అంత మందికి సరిపడా స్థలం లేకపోవడంతో కాస్త తోపులాట జరిగింది. ఒకానొక సమయంలో పోలీసులు పూర్తిగా చేతులు ఎత్తేశారు. జనాలని కంట్రోల్ చేయడం అసాధ్యమని పవన్ కళ్యాణ్ కు తెలియజేయడంతో పవన్ కళ్యాణ్ సభను అర్థంతరంగా ముగించాల్సి వచ్చింది.
అయితే అప్పటికే చాలా సేపు రైతులతో చర్చాగోష్టి జరిగింది. రాయలసీమ లో పవన్ కళ్యాణ్ కు ఇంత స్థాయిలో స్పందన వస్తుందని ఊహించని రాజకీయ పార్టీలు ఆశ్చర్యపోతున్నాయి. అయితే పవన్ కళ్యాణ్ ని చూడడానికి వచ్చిన వారంతా ఓట్లు వేస్తారని అనుకోలేమని ఇతర పార్టీలు భావిస్తున్నాయి. కానీ వచ్చిన అభిమానుల్లో చాలామంది అక్కడ సీఎం నినాదాలతో ప్రాంగణాన్ని హోరెత్తించారు. మరి రాయలసీమలో పవన్ కళ్యాణ్ కి ఫలితాలు ఎలా ఉంటాయన్నది ఎన్నికలయ్యాకే తెలుస్తుంది.