ఏపీలో ఎలక్షన్ హీట్ రోజు రోజుకీ పెరుగుతోంది. నోటిఫికేషన్ ఇంకా రాకపోయినా… ఇప్పటికే ఎన్నికల కళ వచ్చేసింది. రాజకీయ పార్టీలు తమ ప్రచారాన్ని మరింత ఉధృతం చేస్తున్నాయి. వాటికి సినిమాలూ.. ఇతోదికంగా సాయం చేస్తున్నాయి. వైకాపాకి బూస్టప్ ఇవ్వడానికి ‘యాత్ర 2’ రెడీ అవుతోంది. ఫిబ్రవరి 9న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. అదే రోజున పవన్ కల్యాణ్ ‘కెమెరామెన్ గంగతో రాంబాబు’ సినిమాని రీ రిలీజ్ చేయాలని నిర్మాతలు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. పవన్ సినిమాల్లో పొలిటికల్ హీట్ ఉన్న సినిమా.. ‘గంగతో రాంబాబు’. అందులో పొలిటికల్ సెటైర్లు బాగా పేలాయి. ఎన్నికల వేళ… ఈ సినిమాని రీరిలీజ్ చేస్తే పవన్ ఫ్యాన్స్కి కాస్త హుషారు వస్తుందని నిర్మాతలు భావిస్తున్నారు. ఆ రోజుల్లో బాక్సాఫీసు దగ్గర ఈ సినిమా పెద్దగా ప్రభావితం చేయలేదు. కాకపోతే రీ రిలీజులకు మంచి గిరాకీ ఏర్పడింది. ‘ఆరెంజ్’ లాంటి డిజాస్టర్లు రిలీజ్ చేసినా, జనం బాగానే చూస్తున్నారు. పైగా పొలిటికల్ సీజన్ ఆయె. అందుకే రాంబాబు మళ్లీ రంగంలోకి దిగుతున్నాడు. రిలీజ్ డేట్ ఇంకా ఖరారు కాలేదు. కాకపోతే ఫిబ్రవరి 9న ‘యాత్ర’కు పోటీగా రావడం ఖాయమని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి.