జనసేన అధినేత పవన్ కల్యాణ్ జోరుమీద ఉన్నారు. ఆయన రైతు భరోసా యాత్రను ఈ సారి కర్నూలు జిల్లాలో నిర్వహించనున్నారు. ఇప్పటికే రెండు జిల్లాల్లో యాత్ర పూర్తి చేస్తున్నారు మొదట ఉమ్మడి అనంతపురం జిల్లాలో.. తర్వాత పశ్చిమగోదావరి జిల్లాలో యాత్ర పూర్తి చేసి ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలకు పరిహారం అందించారు. మూడో జిల్లాగా రాయలసీమలోని కర్నూలు జిల్లాను ఎంచుకున్నారు. ఎనిమిదో తేదీన ఉదయం ఆయన కర్నలు జిల్లాలో అడుగు పెడతారు. పలువురు ఆత్మహత్య చేసుకున్నకౌలు రైతుల కుటుంబాలను పరామర్శించి.. సాయంత్రం శిరివెళ్లలో బహిరంగసభ నిర్వహిస్తారు.
అక్కడ మిగిలిన వారికి ఆర్థిక సాయం చేస్తారు. ఒక్కో రైతు కుటుంబానికి రూ. లక్ష చొప్పున పవన్ కల్యాణ్ ఇస్తున్నారు. కర్నూలు జిల్లాలోనూ పెద్ద ఎత్తున కౌలు రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ప్రభుత్వం వారిని పెద్దగా ఆదుకోలేదు. ఇటీవల పవన్ కల్యాణ్ పరామర్శకు వెళ్తున్నారని తెలిసిన తర్వాత అరకొరగా కొన్ని కుటుంబాలకు పరిహారం మంజూరు చేస్తున్నారు. అన్ని కుటుంబాలకు ఇవ్వడం లేదు. పవర్ కల్యాణ్ పర్యటన వల్లనే భయపడి ఇస్తున్నారని జనసేన నేతలు అంటున్నారు. వైసీపీ నేతలు మాత్రం భయపడి ఇవ్వడం లేదని. .. ప్రాసెస్ ప్రకారం ఇస్తున్నామని అంటున్నారు.
పవన్ పర్యటన ఖరారైనంది కనుక ఇప్పుడు పవన్ కల్యాణ్ పరామర్శించే కుటుంబాల వివరాలు తెలుసుకుని వారికి ప్రత్యేకంగా నష్టపరిహారం జారీ చేసే అవకాశాలు ఉన్నాయని జనసేన వర్గాలు చెబుతున్నాయి. రాయలసీమలో జనసేన ఉనికి కాస్త తక్కువగా ఉంది. అక్కడ కార్యకలాపాలు పెంచాలని పవన్ కల్యాణ్ భావిస్తున్నారు. ఈ క్రమంలో పవన్ కల్యాణ్ రైతు భరోసా యాత్ర… ఆ పార్టీ కర్నూలు నేతల్లో కొత్త ఉత్సాహం నింపుతోంది.