జనసేన బహుజన సమాజ్వాది పార్టీ సంయుక్తంగా ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో మాయావతి తో పాటు పవన్ కళ్యాణ్ కూడా పాల్గొన్నారు. ఈ సభలో పవన్ కళ్యాణ్ కేసీఆర్ ని ఉద్దేశిస్తూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారాయి.
కేసీఆర్ ని ఉద్దేశించి పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో వేలు పెట్టవద్దని కేసీఆర్ ను కోరారు. ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో కేసీఆర్ తటస్థంగా ఉంటే అందరికి మంచిదని అన్న పవన్ కళ్యాణ్, చంద్రబాబుకి మీకు మధ్య ఉన్న గొడవలు ఆంధ్రప్రదేశ్ ప్రజలని ఇబ్బందుల పాలు చేయకూడదని అన్నారు. “మీకు అంతగా చంద్రబాబు మీద పగ ఉంటే, అంతగా ఆయనకు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలనుకుంటే, ఆయన మీద ఉన్న ఓటుకు నోటు కేసు ను తిరగదోడండి, దానికి ఎవరూ ఏమీ అనుకోరు కానీ, అనవసరంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజల మీద జగన్ ని రుద్దటానికి ప్రయత్నించకండి” అంటూ పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు.
అలాగే,’వైఎస్ రాజశేఖర రెడ్డి బతికున్నప్పుడు తెలంగాణ రాష్ట్ర సమితి ఎమ్మెల్యేలను లాక్కుని, మీ పార్టీని బలహీనం చేయడానికి ప్రయత్నించిన విషయం గుర్తు తెచ్చుకోండి కేసీఆర్ గారూ’ అని వ్యాఖ్యానించిన పవన్ కళ్యాణ్, మరి అప్పట్లో తెలంగాణ ను అంతగా వ్యతిరేకించిన వైయస్ రాజశేఖర్ రెడ్డి తనయుడు అయిన జగన్ ను ఇప్పుడు మీరు ఎందుకు మోస్తున్నారు అంటూ ప్రశ్నించారు. జగన్ తెలంగాణలో పర్యటిస్తానని వచ్చినప్పుడు తెలంగాణ విద్యార్థులు రాళ్లతో దాడి చేశారని గుర్తు చేసిన పవన్ కళ్యాణ్, ఇప్పుడు అదే జగన్ కి మీరు ఎందుకు వెనకాల నుండి మద్దతు పలుకుతున్నారు అంటూ కేసీఆర్ ని ప్రశ్నించారు. దాదాపు పదేళ్ల పాటు తెలంగాణ ఉద్యమ సందర్భంలో మీ ద్వారా మాటలు పడ్డామని, దయ చేసి ఇకనైనా ఆంధ్రులని వదిలేయండి అని కేసీఆర్ కి పవన్ కళ్యాణ్ విన్నపం చేశారు.
అంతే కాకుండా, జగన్ యాదాద్రి కి చెప్పులు వేసుకుని వస్తే, మీరు సహిస్తారా కేసీఆర్ గారూ అని అడిగిన పవన్ కళ్యాణ్, మరి ఆయన తిరుపతికి అలాగే వచ్చాడు అంటూ గుర్తు చేశారు. మీ మీద ఒక ఉద్యమ నేతగా నాకు ఎంతో గౌరవం ఉందని వ్యాఖ్యానించిన పవన్ కళ్యాణ్, ఆ గౌరవం ఎప్పుడు నిలిచి ఉండేలా కేసీఆర్ చూసుకోవాలని అన్నారు. ఇంతగా విన్నపం చేసిన తర్వాత కూడా కేసీఆర్ జగన్ కు ఇలాగే మద్దతు ప్రకటిస్తే, కేసీఆర్ ఉద్యమ స్ఫూర్తితో నే తాను కూడా రోడ్ల మీదకు రావాల్సిన వస్తుందని హెచ్చరించారు.
ఏది ఏమైనా పవన్ కళ్యాణ్ కేసీఆర్ కి విన్నపం చేస్తున్నట్లుగానే చేసిన వ్యాఖ్యలు, మాస్టర్ స్ట్రోక్ అంటూ రాజకీయ పరిశీలకులు అభివర్ణిస్తున్నారు. ఇప్పుడు కేసీఆర్ గనక పవన్ కళ్యాణ్ మీద రెచ్చిపోయి చిన్న వ్యాఖ్య చేసినా అది తెలంగాణలోని సీమాంధ్రుల మీద ప్రభావం చూపే అవకాశం ఉంది, వారం రోజుల్లో జరగనున్న తెలంగాణ ఎన్నికలలో దాని ప్రభావం కనిపించే అవకాశం ఉంది. నిజానికి పవన్ కళ్యాణ్ గత కొద్ది రోజులుగా కేసిఆర్ ని టార్గెట్ చేస్తూ పలు వ్యాఖ్యలు చేసినప్పటికీ తెలంగాణ రాష్ట్ర సమితి నాయకులు కానీ కేసీఆర్ కానీ పవన్ కళ్యాణ్ మీద తిరిగి ఒక్క వ్యాఖ్య కూడా చేయలేక పోవడానికి కారణం కూడా ఇదేనని పరిశీలకులు భావిస్తున్నారు. అదీ కాకుండా, కేసీఆర్ వైపు నుండి కానీ టీఆర్ఎస్ వైపు నుండి గాని ఏదైనా బలమైన ప్రతి స్పందన వస్తే అది జగన్ అవకాశాలకు గండి కొట్టే అవకాశం కూడా కనిపిస్తోంది.