అన్నదాత కన్నీరు ఆగే వరకు పోరాడతానని జనసేన అధినేత పవన్ కల్యాణ్ పిడికిలి బిగించారు. రైతులను ఆదుకోవాలంటూ.. కాకినాడలో ఉదయం నుంచి సాయంత్రం వరకు రైతు సౌభాగ్య దీక్ష చేశారు. దీక్ష ముగించిన తర్వాత పవన్ కల్యాణ్ సర్కార్ పై విరుచుకుపడ్డారు. కూల్చి వేతలతోనే వైసీపీ పాలన మొదలు పెట్టిందని … ఇప్పుడు రైతుల జీవితాలను కూల్చివేస్తున్నారని పవన్ కల్యాణ్ మండిపడ్డారు. తనను ఎవరూ ఏం చేయలేరని జగన్కు అనిపించోచ్చు.. కానీ ఎంతో మంది రాజులు, చక్రవర్తులు కాల గర్భంలో కలిసిపోయారు.. మీరెంత అని పవన్ హెచ్చరించారు. వైసీపీ నేతలు గూండాల్లా బెదిరిస్తున్నారని మండిపడ్డారు. కౌలు రైతులకు కులం అంటగట్టడంపై తీవ్ర విమర్శలు చేశారు. తినే గింజలకు కులం లేనప్పుడు రైతుకెందుకు కులమని.. ప్రశ్నించారు. వైసీపీ నేతలకు రైతుల కడుపుకోత కనబడటం లేదని.. రైతుకు పట్టం కట్టేందుకే జనసేన ఉందని స్పష్టం చేశారు.
జనసేన పార్టీ పదవుల కోసం పుట్టింది కాదని .. ప్రజల సమస్యల పరిష్కారం కోసమే పుట్టిందని భరోసా ఇచ్చారు. రైతులు కడుపుమండి నా దీక్షకు వచ్చారని.. నా పక్కన నిలబడి ఫొటోలు తీసుకునేందుకు రాలేదన్నారు. అసెంబ్లీ జరుగుతున్న తీరుపైనా.. పవన్ విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో ఇంతమంది రైతులు, భవన నిర్మాణ కార్మికులు చనిపోయారు.. వారికి నివాళులర్పించి… అసెంబ్లీ ప్రారంభించాలన్న ఇంగిత జ్ఞానం వైసీపీ నేతలకు లేదన్నారు. అసెంబ్లీలో బోటు ప్రమాద మృతులకు సంతాపం తెలపలేదని… అసెంబ్లీని హుందాగా నడపాలి, సభలో తిట్లే ఎక్కువున్నాయని గుర్తు చేశారు. సహనం జనసేన బలం… బలహీనత కాదని సున్నితంగా హెచ్చరికలు పంపారు. భయపడి వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని.. రైతు కన్నీరు ఆగేవరకు మా పోరాటం కొనసాగుతుందని రైతులకు భరోసా ఇచ్చారు. ధాన్యం బస్తాకు రూ.1500 ఇస్తే చేసిన తప్పుకు క్షమాపణ చెప్పినట్టు అవుతుందన్నారు.
నిత్యావసరాల వస్తువుల ధరల పెరుగుదలపైనా పవన్ మండిపడ్డారు. నేడు సామాన్యుడు ఉల్లి కొనలేని ధరకు చేరినా… మంత్రులు సిగ్గులేకుండా మాట్లాడుతున్నారన్నారు. ప్రజలు గొర్రెల్లా ఉంటే సండే కర్రీలా తినేస్తారు … ప్రజలు సింహాలుగా మారకపోతే బతకడం కష్టమని పిలుపునిచ్చారు. జన సైనికులు రైతులకు కూలీలు దొరకని సమయంలో సాయం చేయమని సూచించారు. కాకినాడ రైతు దీక్షకు.. పవన్ … తన ఫ్యాన్స్ ను కంట్రోల్ లో పెట్టగలిగారు. గతంలో జరిగిన వాటికి భిన్నంగా.. రాజకీయ దీక్షలాగానే… శిబిరాన్ని కొనసాగించారు. పెద్ద ఎత్తున రైతులు కూడా తరలి రావడం జనసేన వర్గాల్నీ సంతృప్తి పరిచింది.