నివార్ తుపాన్ విషయంలో నష్టపోయిన రైతులకు నష్టపరిహారం అంశం ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ దుమారానికి కారణం అవుతోంది. ప్రభుత్వం ఎలాంటి సాయం ప్రకటించకపోవడం… రైతుల్లో ఆందోళన పెరిగిపోతూండటంతో రాజకీయ పార్టీలు రంగంలోకి దిగుతున్నాయి. జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా.. చాలా రోజుల తర్వాత రైతుల కోసం ప్రజల్లోకి వెళ్తున్నాయి. నివార్ తుపాను వల్ల పాడైన పంటలను పరిశీలించేందుకు కోస్తా, రాయలసీమలకు వెళ్తున్నారు. బుధవారం నుంచి పవన్ పర్యటన ప్రారంభమవుతుంది. బుధవారం గుంటూరు జిల్లాలో ఆ తర్వాత మూడు రోజుల పాటు అంటే.. 3,4,5 తేదీల్లో చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో పర్యటిస్తారు.
పంట నష్టపోయిన రైతులతో సమావేశమవుతారు. వారికి నష్టపరిహారం ప్రకటించే దిశగా ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేలా పవన్ కల్యాణ్ పర్యటన ఉండే అవకాశం ఉంది. బీజేపీతో పొత్తు పెట్టుకోక ముందు పవన్ కల్యాణ్ యథేచ్చగా తన పార్టీ కార్యక్రమాలు నిర్వహించేవారు. తర్వాత ఆయన ఏ పని చేయాలన్నా.. బీజేపీ పర్మిషన్ తో చేయాల్సి వచ్చేది. ఈ కారణంగా జనసేనాని పర్యటనలు కూడా కుదించుకుపోయాయి. ఓ వైపు బీజేపీ నేతలు.. తమ పర్యటనలు.. కార్యక్రమాలు తాము చేసుకుంటున్నారు. జనసేన మాత్రం కామ్ అయిపోయింది. ఈ పరిస్థితుల్లో ఇక బీజేపీతో అన్నింటినీ చర్చించాల్సిన పని లేకుండా.. పవన్ కల్యాణ్ రంగంలోకి దిగాలని నిర్ణయించుకున్నారు.
ఈ పర్యటనలో చిత్తూరు జిల్లాలోనూ పర్యటించబోతున్నారు. తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో పవన్ కల్యాణ్ పర్యటించబోతున్నారు. అక్కడ తన బలాన్ని ఆయన ప్రదర్శించే అవకాశం ఉంది. తిరుపతిలో పోటీ చేయాలని జనసేన అనుకుంటోంది. కానీ బీజేపీ మాత్రం.. తామే పోటీ చేస్తామని చెబుతోంది. ఈ సందర్భంగా.. రైతులకు భరోసా ఇవ్వడంతో పాటు.. తిరుపతిలో తమ బలాన్ని ప్రదర్శించి.. బీజేపీకి అవకాశం లేదని చెప్పేలా.. పర్యటన భారీగా ఉండేలా జనసేనాని ప్లాన్ చేసుకుంటున్నారు. అటు రైతులకు సాయం కోసం ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుదుకు.. ఇక రాజకీయంగా బీజేపీని ఇబ్బందుల్లోకి నెట్టేందుకు పవన్ కల్యాణ్ టూర్ ఉపయోగపడే అవకాశం ఉంది.