జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఢిల్లీ నుంచి తిరిగి వచ్చారు. శుక్రవారం ఉదయం.. విజయవాడలో డొక్కా సీతమ్మ అన్నదాన కేంద్రాలను ప్రారంభించిన తర్వాత నేరుగా ఢిల్లీకి చేరుకున్నారు. కానీ ఎందుకు చేరుకున్నారు..? ఎవరితో సమావేశం అవుతారు..? ఎజెండా ఏమిటన్నదానిపై.. క్లారిటీ లేదు. కానీ పవన్ కల్యాణ్.. తాను ఢిల్లీలో ఉన్నానని.. కీలక అంశాలపై చర్చలు జరుపుతున్నానన్న ఓ సంకేతాన్ని… సోషల్ మీడియా ద్వారా ఇచ్చారు. ఢిల్లీ మీడియాకు ఏపీ ప్రభుత్వంపై ఇలాంటి అభిప్రాయం ఉందంటూ.. కార్టూన్లు, పేపర్ కటింగ్స్ పోస్ట్ చేశారు.
పవన్ కల్యాణ్ రెండు రోజులు.. మీడియా అటెన్షన్ లేకుండానే ఢిల్లీలో గడిపారు. తాను ఎక్కడికి వెళ్లారు.. ఎవరెవరితో భేటీ అయ్యారన్న సమాచారాన్ని బయటకు రానీయలేదు. కానీ కొంత మంది కేంద్ర పెద్దలతో సమావేశమయ్యారని మాత్రం చెబుతున్నారు. అపాయింట్మెంట్లు ఖరారయ్యాయి కాబట్టే.. ఆయన హడావుడిగా ఢిల్లీ వెళ్లారని.. భేటీలు కూడా జరిగాయని చెబుతున్నారు. సహజంగా… ఆ సమావేశాలు రహస్యంగా ఉంచాలనుకుంటే బయటకు రావు. పవన్ తన భేటీల విషయం…తాను చెప్పుకుంటానని.. ఫోటోలు మీడియాకు విడుదల చేయవద్దని.. ఆ ప్రముఖులకు ముందుగానే చెప్పినట్లుగా తెలుస్తోంది.
పవన్ కల్యాణ్.. ఢిల్లీ పర్యటన.. కీలకమైనదేనని.. దాని వెనుక ప్రత్యేకమైన అజెండా ఉందని.. వైసీపీ కూడా నమ్ముతోంది. ఎప్పుడూ లేనిది పవన్ కల్యాణ్ ఢిల్లీ వెళ్లినప్పటి నుండి ఆ పార్టీ నేతలు… ఆయనపై విమర్శలు చేస్తున్నారు. ఒక సారి చంద్రబాబు పంపారని.. మరోసారి..ఎప్పుడూ వెళ్లనిది ఇప్పుడే ఎందుకు వెళ్లారని.. ప్రశ్నిస్తున్నారు. పవన్ కల్యాణ్ ఢిల్లీకి వెళ్తే.. వైసీపీ నేతలు ఎందుకు కంగారు పడుతున్నారో చాలా మందికి అర్థం కావడం లేదు. ఢిల్లీలో అసలేం జరిగిందో.. పవన్ కల్యాణ్.. నేరుగా వెల్లడించే వరకూ.. ఆయన ఎవరెవరితో భేటీ అయ్యారో బయటకు రావడం కష్టమే.