ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మార్పులు చాలా వేగంగా వచ్చేస్తున్నాయి. ఈ మార్పులన్నీ కుల, మత సమీకరణాలతోనే ఉంటున్నాయి. ఇందులో ప్రధానంగా కాపు సామాజివర్గం చుట్టూనే అంతా తిరుగుతోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రెడ్లు హార్డ్ కోర్ సపోర్టర్లుగా ఉండగా… తెలుగుదేశం పార్టీకి కమ్మ సామాజికవర్గం ఆ బాధ్యత పోషిస్తోంది. చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు కాపు సామాజికవర్గం మొత్తం ఆ పార్టీ కోసం పని చేశారు. ప్రజారాజ్యం పార్టీని చిరంజీవి కాంగ్రెస్‌లో కలిపేయడంతో.. మళ్లీ కాపు సామాజికవర్గం ఏదో ఓ పార్టీకి సపోర్టర్లుగా మారాల్సిన పరిస్థితి వచ్చింది. గత ఎన్నికల్లో పవన్ కల్యాణ్ జనసేన పార్టీ పెట్టడంతో… వారికో ఫ్లాట్ ఫామ్ దొరికినట్లయింది కానీ… పవన్ పోటీ చేయలేదు. టీడీపీ,బీజేపీ కూటమి మద్దతు ప్రకటించడంతో… వారి గెలుపు కూడా సునాయాసమయింది.
ఇప్పుడు రాజకీయాలు మారిపోయాయి. జనసేన అధినేత పవన్ కల్యాణ్… వ్యూహాత్మకంగానో, అన్యాపదేశంంగానో టీడీపీని దూరం పెట్టేశారు. దీంతో ఇప్పుడు కాపు సామాజికవర్గం మొత్తం… ముఖ్యంగా యువతరం జనసేనవైపు నిలిచే అవకాశం ఉంది. జనసేన ఓటు బ్యాంకు ఏదీ అంటే…కచ్చితంగా కాపు సామాజికవర్గమే అంటారు. అందులో ఎలాంటి అనుమానాలుండవు. అందుకే పవన్ కల్యాణ్‌ను ఉత్తరాంధ్రలోని కొన్నిప్రాంతాల్లో ఉభయగోదావరి జిల్లాల్లో చాలా బలమైన నేతగా అంచనా వేస్తున్నారు.
ఇప్పుడు భారతీయ జనతాపార్టీ కూడా… కాపులనే టార్గెట్ చేసుకుంది. నిజానికి వెంకయ్యనాయుడును ఉపరాష్ట్రపతిగా పంపేయడానికి, కంభంపాటి హరిబాబును ఏపీ బీజేపీ అధ్యక్ష పదవి నుంచి దింపేయడానికి కారణం …సామాజిక వర్గమే అన్న ప్రచారం ఉంది. ఏపీలో రెడ్లు, కమ్మలతో ధీటుగా బలంగా ఉన్న కాపు సామాజికవర్గానని తమ దరికి చేర్చుకుంటే.. బలీయమైన శక్తిగా ఎదగొచ్చన్నది ఆ పార్టీ వ్యూహం. తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ నుంచి బయటకు వచ్చిన తర్వాత…ఏపీ బాధ్యతలను తీసుకున్న రామ్ మాధవ్ బ్లూ ప్రింట్లో ప్రధానాంశం కాపు సామాజికవర్గమే. అందుకే ఆ వర్గం నుంచి ప్రభావవంతమైన వ్యక్తిని ఏపీ బీజేపీ అధ్యక్షునిగా నియమించాలనుకున్నారు. గోదావరి జిల్లాల్లో ఆ పార్టీకు ఉన్న నేతలంతా.. ఆ సామాజివర్గమే. కానీ …వారికి వారి సామజికవర్గంలోనే పలుకుబడి లేదు. అందుకే కన్నా లక్ష్మినారాయణ వైపు మొగ్గారు. రాజీనామా చేసినా… బుజ్జగించి.. పార్టీ అధ్యక్ష పదవి ఇచ్చారు. ఇప్పుడు పవన్‌కు పోటీగా… కాపులను బీజేపీ వైపు పోలరైజ్ చేయాల్సిన బాధ్యత కన్నాపై పడింది.
మరో వైపు సీబీఐ మాజీ జేడీ లక్ష్మినారాయణ కూడా రాజకీయాల్లోకి వచ్చేందుకు కసరత్తు చేసుకుంటున్నారు. ప్రజాసమస్యలపై అధ్యయనం చేసేందుకు ఆయన జిల్లాలు తిరుగుతున్నారు. రెండు నెలల్లో ఆయన కార్యాచరణ ప్రకటిస్తానని చెబుతున్నారు. బహుశా ఆయన ఆమ్ ఆద్మీ పార్టీ తరపునో..లేదా… ఆయనే సొంతంగా అలాంటి పార్టీనో పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆయన సామాజివర్గం కూడా… అదే. ఆయన రాజకీయ బరిలోకి దిగితే…అండగా ఉండాల్సింది కాపు సామాజికవర్గమే. ఆయన తనకు కులం, మతం లేదన్నా..రాజకీయం ఒప్పుకోదు.
మొత్తానికి వచ్చే ఎన్నికల్లో గెలుపోటములు నిర్ణయించే సామాజికవర్గంలో… ముగ్గురు కీలక నేతలుగా రంగంలో ఉన్నారు. పవన్ తో పాటు సీబీఐ మాజీ జేడీని కూడా… బీజేపీ ఇప్పటికే ట్రాక్‌లో పెట్టిందని ప్రచారం జరుగుతోంది. అదే జరిగితే… కాపు ఓట్లన్నీ పోలరైజ్ అవుతాయి. లేదంటే… చీలిక వస్తుంది. అది అంతిమంగా.. ఏ పార్టీకి లాభం చేస్తుందో… ఎన్నికల ఫలితాలే తేల్చాలి.