తెలుగుదేశం పార్టీతో జనసేన అధినేత పవన్ కల్యాణ్ తెగ తెంపులు చేసుకున్నారు. తనపై ముఖ్యమంత్రి చంద్రబాబు తనయుడు లోకేష్ కుట్ర చేస్తున్నారని పవన్ కల్యాణ్ గట్టిగా నమ్ముతున్నారు. అదే సమయంలో కారణాలేమైనా కానీ… భారతీయ జనతాపార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలతో మాత్రం కాస్తంత సాఫ్ట్ స్ట్రాటజీని అవలంభిస్తున్నారు. ఈ పరిణామాలన్నీ చూస్తే… పవన్ కల్యాణ్ ఇక తెలుగుదేశం పార్టీకి మళ్లీ దగ్గరవడం కష్టమే. కానీ రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరు. ఎన్నికల సమయానికి ఏమైనా జరగొచ్చు. ఇప్పటికైతే… జనసేన సపోర్ట్ లేనట్లే. పవన్ కల్యాణ్ మద్దతు లేకపోతే.. తెలుగుదేశం పార్టీకి ఎలాంటి నష్టం జరుగుతుందన్న దానిపై… ఏపీ రాజకీయాల్లో విస్త్రత చర్చలు ప్రారంభమయ్యాయి. తెలుగుదేశం పార్టీ నేతలు మాత్రం… పవన్ మద్దతు వల్ల తమకు వచ్చే లాభం ఏమీ లేదని డిసైడ్ చేస్తున్నారు. బీజేపీ, జనసేన మద్దతు లేకుండా తాము పంచాయతీ, స్థానిక సంస్థల ఎన్నికల్లో ఘన విజయాన్ని సాధించామని గుర్తు చేస్తున్నారు. వారి వాదనలో లాజిక్ ఉంది… కానీ అసలు మ్యాజిక్ మిస్సయ్యారన్న అభిప్రాయాలు… ప్రొఫెసర్ నాగేశ్వర్ లాంటి విశ్లేషకులు తేల్చిచెప్పేస్తున్నారు.
స్థానిక సంస్థలు, పంచాయతీ ఎన్నికలకు, రాష్ట్ర ముఖ్యమంత్రిని నిర్దేశించే అసెంబ్లీ ఎన్నికలకు చాలా తేడా ఉంటుంది. ఓటు విషయంలో ప్రజల ఆలోచనా దృక్పథం కూడా మారుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, జనసేనతో కలసి పోటీ చేసినా.. వైసీపీ కంటే… ఐదు శాతం ఓట్లు మాత్రమే ఎక్కువ వచ్చాయి. ఆ తేడా ఐదు లక్షల ఓట్లు మాత్రమేనని వైసీపీ నేతలు ప్రచారం చేస్తున్నారు. అయితే బీజేపీ పోటీ చేసిన పదమూడు అసెంబ్లీ స్థానాల్లో వచ్చిన ఓట్లను కూడా లెక్కలోకి తీసుకుంటే ఆ తేడా కొంచెం ఎక్కువే కావొచ్చు. అయితే అదే సమయంలో.. బీజేపీ సంప్రదాయక ఓటు బ్యాంక్, అలాగే పవన్ కల్యాణ్ క్రేజ్, ఆయన వెనుక ఉన్న సామాజికవర్గం మద్దతు అన్నీ కలిపితేనే … ఈ మాత్రం ఆధిక్యత వచ్చిందనేది.. విశ్లేషకులు చెబుతున్నమాట.
ఇప్పుడు పవన్ కల్యాణ్ దూరమవడం టీడీపీ నేతలను అంతర్గతంగా ఆందోళనకు గురి చేస్తోంది. ఈ విషయాన్ని… డిప్యూటీ సీఎం చినరాజప్ప… తన మాటలతోనే వ్యక్తం చేశారు కూడా. వచ్చే ఎన్నికల నాటికి పవన్ కల్యాణ్ తమకు మద్దతిస్తారన్న నమ్మకాన్ని చినరాజప్ప వ్యక్తం చేశారు కూడా. పవన్ వల్ల ఏ మాత్రం నష్టం లేకపోతే… చినరాజప్ప.. ఇలా చెప్పాల్సిన అవసరం ఏముంది..?. అదే సమయంలో పవన్ కల్యాణ్‌పై టీడీపీ నేతలు ఎవరూ… తీవ్రమైన విమర్శలు చేయడం లేదు. తనపై పవన్ నేరుగా ఆరోపణలు చేస్తున్నా… లోకేష్… తాను ఎప్పటికీ పవన్‌ను గౌరవిస్తూనే ఉంటానని సందర్భం వచ్చినప్పుడల్లా చెబుతున్నారు. చంద్రబాబు కూడా… వేరే వారి మాటలను నమ్మడం వల్లనో.. లేక మరో ఇబ్బందికరమైన పరిస్థితులో పడటం వల్లనే … పవన్ టీడీపీని టార్గెట్ చేస్తున్నారు కానీ.. మనస్ఫూర్తిగా కాదని పార్టీ నేతలకు చెబుతున్నారు. పవన్‌పై టీడీపీ విధానంతోనే.. జనసేన తమతో లేకపోవడం వల్ల ఎంతో కొంత నష్టం వస్తుందన్న భావన వారు పరోక్షంగానే వ్యక్తం చేస్తున్నట్లవుతుంది.
ప్రొఫెసర్ నాగేశ్వర్ లాంటి వాళ్ల విశ్లేషణల ప్రకారం … పవన్ కల్యాణ్ అన్ని స్థానాలలో పోటీ చేయడం వల్ల.. ఆయన గెలవకపోవచ్చు. చాలా చోట్ల డిపాజిట్లు కూడా తెచ్చుకోలేకపోవచ్చు. కానీ… ఓట్లను చీల్చడం ద్వారా.. చంద్రబాబును.. అంటే తెలుగుదేశం పార్టీని ఓడించగలరన్న అంచనాలున్నాయి. ముఖ్యంగా పవన్ కల్యాణ్…తనపై కుల ముద్ర వద్దనుకుంటున్నప్పటికీ.. ఆయన ఓటు బ్యాంక్ మొత్తం ఆయన సామాజికవర్గానికి చెందినదే. ఉత్తరాంధ్రతో పాటు ఉభయగోదావరి జిల్లాల్లో… ఈ ప్రభావం ఎక్కువ ఉంటుంది. గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ.. ఇక్కడే క్లీన్ స్వీప్ చేసింది. అప్పుడు పవన్ మద్దతు కీలకమయింది. ఇప్పుడు ఆ సపోర్ట్ లేకపోతే… కనీసం సగం సీట్లకు కోత పడే ప్రమాదం ఉంది. అందుకే జనసేన నేతలు.. ఎవరూ గెలుస్తామని చెప్పడం లేదు.. కానీ టీడీపీని ఓడిస్తామని చాలెంజ్ చేస్తున్నారు.