జనసేన అధినేత పవన్ కల్యాణ్.. తెలుగు రాష్ట్రాల్లో బీఎస్పీతో పొత్తు పెట్టుకోవాలని నిర్ణయించుకున్నారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని లక్నో వెళ్లిన పవన్.. బీఎస్పీ అధినేత్రి మాయావతితో భేటీ అయ్యారు. ఎన్నికల్లో పొత్తుపై ఆమెతో చర్చించారు. అంబేడ్కర్ ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని ముందుకెళ్లాల్సిన అవసరం ఉందని.. మాయావతి మార్గనిర్దేశకత్వం చాలా అవసరమని పవన్ అభిప్రాయపడ్డారు. సామాజిక న్యాయం అందరికీ అందాల్సిన అవసరం ఉందన్నారు. ఈ ఎన్నికల్లో వామపక్షాలతో కలిసి వెళ్తామని ఇదివరకే పవన్ ప్రకటించారు. తాజాగా బీఎస్పీతోనూ కలిసి పోటీ చేయనున్నట్లు ప్రకటించారు.
గతంలోనే మాయావతిని కలిసేందుకు ఓ సారి లక్నో వెళ్లారు కానీ.. అప్పట్లో కలవడం సాధ్యం కాలేదు. ఓ బీఎస్పీ ముఖ్యనేతతో సమావేశమై తిరిగి వచ్చారు. అయితే.. ఇటీవలి కాలంలో మరోసారి బీఎస్పీ వ్యవస్థాపకుడు కాన్షీరాం గురించి పవన్ కల్యామ్ పదే పదే గుర్తు చేసుకుంటున్నారు. తెలుగుదేశం పార్టీ నుంచి జనసేనలో చేరిన రావెల కిషోర్ బాబు… కేంద్ర ప్రభుత్వ ఉద్యోగిగా ఉన్నప్పుడు కాన్షీరాం వద్ద పని చేశారు. ఆ పరిచయాలు ఉండటంతో… మాయావతి అపాయింట్మెంట్ సంపాదించినట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకూ.. వామపక్షాలతోనే పొత్తులను ఖరారు చేయలేదు. బీఎస్పీతో ఇప్పుడు ప్రత్యేకంగా చర్చలు ప్రారంభించాల్సి ఉంది.
ఆంధ్రప్రదేశ్‌లో కానీ.. తెలంగాణలో కానీ.. బీఎస్పీకి ఎలాంటి క్యాడర్ లేదు. కానీ.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాన పార్టీల్లో టిక్కెట్ రాని అభ్యర్థులంతా… బీఎస్పీ బీఫాం తెచ్చుకుని ఆ పార్టీపై పోటీ చేశారు. పలు చోట్ల గట్టి పోటీ కూడా ఇచ్చారు. ఇబ్రహీంపట్నం నుంచి బీఎస్పీ అభ్యర్థిగా పోటీ చేసిన మల్ రెడ్డి రంగారెడ్డి.. చాలా కొద్ది తేడాతో ఓడిపోయారు. ఏపీలో అయితే.. ఈ బీ ఫాంల కోసం కూడా… పెద్దగా పోటీ ఉండదు. అక్కడ క్యాడర్ ఎవరూ లేరు. అలాంటి పార్టీతో పవన్ కల్యాణ్ లక్నో వెళ్లి మరీ పొత్తులు పెట్టుకోబోతున్నట్లు ప్రకటించడం… ఓ రకంగా రాజకీయవర్గాలను ఆశ్చర్య పరిచేదే. దళితుల్లో బీఎస్పీకి కొంత క్రేజ్ ఉంది. అయితే అది ఓట్లుగా మారుతుందా లేదా.. అనేది సందేహమే.