హైదరాబాద్: జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారానికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ను ప్రచారానికి పిలవలేదని భారతీయ జనతా పార్టీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి చెప్పారు. కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయతో కలిసి కిషన్ రెడ్డి నిన్న హైదరాబాద్‌లో విలేకరులతో మాట్లాడారు. గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో ఈ నెల 26 నుంచి కేంద్ర మంత్రులు వెంకయ్య నాయుడు, హంసరాజు ఆహిరి, ప్రకాష్ జవదేకర్, నక్వీ పాల్గొంటారని చెప్పారు. త్వరలో బీజేపీ-టీడీపీ ఉమ్మడి విజన్ డాక్యుమెంట్ ప్రకటిస్తామన్నారు. వచ్చే నెలలో ప్రధాని మోడి తెలంగాణకు వస్తారని చెప్పారు. రామగుండం ఎరువుల కంపెనీ, ఎన్టీపీసీలకు మోడి శంకుస్థాపన చేస్తారని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం సాయంతోనే హైదరాబాద్ విశ్వనగరంగా అభివృద్ధి చెందిందని దత్తాత్రేయ అన్నారు. హైదరాబాద్ నగరాన్ని మినీ ఇండియాగా అభివర్ణించారు. ఉగ్రవాదులకు ఎమ్ఐఎమ్ మద్దతుగా నిలుస్తోందని, ఆ పార్టీతో టీఆర్ఎస్ లోపాయికారీ పొత్తు పెట్టుకుందని ఆరోపించారు.
పవన్ గ్రేటర్ ప్రచారానికి వస్తాడని ఊహించి టీఆర్ఎస్ పదిరోజుల క్రితమే అతనిపై ఎదురుదాడి ప్రారంభించిన సంగతి తెలిసిందే. నిజామాబాద్ ఎంపీ కవిత గ్రేటర్ ప్రచారాన్ని ప్రారంభిస్తూ ఆంధ్రా వారి ఓట్లకోసం బీజేపీ-టీడీపీ పవన్‌ను ప్రచారానికి దించుతున్నాయని ఆరోపించారు. మేకప్ చేసుకుని వచ్చి ఆ తర్వాత ప్యాకప్ చెప్పే పవన్ లాంటి వాళ్ళను ప్రజలు నమ్మరని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తిక్క పవన్ కళ్యాణ్‌కు ఎప్పుడో చుక్కలు చూపించారని కవిత వ్యాఖ్యలు చేశారు.