పవన్ కళ్యాణ్ నటించిన సర్దార్ గబ్బర్ సింగ్ సినిమాని హిందీలో డబ్ చేసి విడుదల చేయడం చాలా పొరపాటని, తనకు అటువంటి తప్పుడు సలహాలను ఇచ్చేవాళ్ళను పవన్ కళ్యాణ్ వదిలించుకోవాలని రామ్ గోపాల్ వర్మ ట్వీట్ మెసేజ్ పెట్టిన సంగతి తెలిసిందే. ఇటీవల అదే విషయం గురించి పవన్ కళ్యాణ్ న్ని మీడియా ప్రశ్నించినపుడు తనకు ఆ ఆ విషయం తెలియదంటూనే రామ్ గోపాల్ వర్మకి చురకలు వేసారు.
వర్మ గురించి పవన్ కళ్యాణ్ ఏమన్నారంటే, “మన తెలుగు సినిమాలన్నిటినీ హిందీలో డబ్బింగ్ చేసి హిందీ ఛానల్స్ లో చూపిస్తున్నారు. జనం కూడా వాటిని చూసి ఆనందిస్తున్నారు. మరి అటువంటప్పుడు మన సినిమాలని మనమే హిందీలో డబ్బింగ్ చేసి విడుదల చేసుకొంటే తప్పేమిటో నాకు అర్ధం కాలేదు. మన తెలుగు సినిమాల మార్కెట్ పెంచాలనే ఉద్దేశ్యంతోనే సర్దార్ గబ్బర్ సింగ్ ని హిందీలో డబ్ చేసి విడుదల చేసాము. మనం వంద సార్లు ప్రయత్నిస్తే కనీసం 101వ సారయినా విజయం సాధించే అవకాశం ఉంటుంది కదా? ఆ ఫలితం నా సినిమాకే దక్కాలని ఏమీ లేదు. ఏ తెలుగు సినిమాకి దక్కినా నేను చాలా సంతోషిస్తాను. ఆ ప్రయత్నంలో భాగంగానే నా సినిమాని హిందీలో డబ్ చేసి విడుదల చేసాను తప్ప వేరే ఉద్దేశ్యంతో కాదు. ఆయన కూడా సినీ రంగంలోనే ఉన్నారు. ఆయన చాలా విచిత్రమయిన వ్యక్తి. ఇతరుల మీద చూపించే ఈ శ్రద్ద ఏదో తన స్వంత సినిమాల మీద పెట్టి ఉండి ఉంటే ఈపాటికి ఆయన వేరే స్థాయిలో ఉండేవారని నా అభిప్రాయం. ఆయనతో నాకు ఎటువంటి విభేదాలు లేవు. ఒకప్పుడు ఎప్పుడో ‘వైఫ్ ఆఫ్ వర ప్రసాద్’ అనే సినిమా కధ చెప్పారు. అది నాకు నచ్చకపోవడంతో చేయలేదు. అంతే. ఆయనని నేను సాటి ‘ఫిలిం మేకర్’ మాత్రమే నేను చూస్తాను. లేకుంటే నేనూ చాలా విషయాలు మాట్లాడగలను. ఫిలిం మేకర్ వేరు..విమర్శకుడు వేరు. ఎవరి పని వారు చేస్తేనే బాగుంటుంది,” అని అన్నారు.
రాజకీయాలలో తన పాత్ర గురించి రామ్ గోపాల్ వర్మ చేస్తున్న విమర్శలకు కూడా పవన్ కళ్యాణ్ జవాబు చెపుతూ, “ఎవరికయినా సినిమాలు, రాజకీయాల గురించి తమ అభిప్రాయాలు చెప్పడం తేలికే. కానీ వాటి లోతు దిగిన వాళ్ళకే అర్ధమవుతుంది. రామ్ గోపాల్ వర్మ సెక్యూరిటీ లేకుండా విజయవాడలో తిరగగలరా? జనంలోకి వెళ్లి నిర్భయంగా మాట్లాడగలరా?” అని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు.