పవన్ కళ్యాణ్ జన సేన పార్టీ ని స్థాపించిన కొత్త లో పవన్ తో పాటు ఉన్న రాజు రవి తేజ జన సేన కు రాజీనామా చేస్తూ పవన్ కళ్యాణ్ పై ఆరోపణలు చేయడం జనసేన అభిమానులకి షాక్ ఇచ్చింది. కానీ జనసేన అంతర్గత వర్గాలకు ఇది పెద్దగా షాక్ ఇవ్వలేదని తెలుస్తోంది. పైగా రాజు రవి తేజ రాజీనామా పై పవన్ కళ్యాణ్ పాజిటివ్ గా స్పందిస్తూ రాసిన లేఖలో అన్యాపదేశంగా ఈ విషయాన్ని ప్రస్తావించారు అని అంటున్నారు. వివరాల్లోకి వెళితే..
రాజు రవి తేజ పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టిన కొత్తలో ఆయన తో పాటు నడిచారు. ఇజం అనే పుస్తకాన్ని కూడా ఆయన పవన్ కళ్యాణ్ భావజాలాన్ని తెలియజేయడానికి రాశారు. పవన్ కళ్యాణ్ ని ఇంతగా అర్థం చేస్తున్న ఆయన, ఇప్పుడు పవన్ కళ్యాణ్ కులాల వారిగా, మతాల వారీగా విభజన రాజకీయాలకు పాల్పడుతున్నారు అంటూ సంచలన ఆరోపణలు చేస్తూ పార్టీకి రాజీనామా చేశారు. అయితే ఆయన పార్టీ వీడడం ఇదే మొదటి సారి కాదు. 2014 ఎన్నికల అనంతరం ఆయన జన సేన పార్టీని వీడారు . అప్పుడు కూడా పవన్ కళ్యాణ్ మీద విమర్శలు చేసి మరీ బయటికి వెళ్లారు. అయితే మళ్లీ కొద్ది కాలం తర్వాత జన సేన లోకి వచ్చారు. ఇప్పుడు మళ్లీ జన సేన వీడి వెళ్ళిపోతూ పవన్ కళ్యాణ్ మీద విమర్శలు చేశారు.
పవన్ కళ్యాణ్ బిజెపి కి దగ్గరవడం ప్రధాన కారణమా?
అయితే రాజు రవితేజ దళిత వర్గానికి చెందిన మేధావి అని, ఈయన కి మొదటి నుండి కూడా బిజెపి అంటే తీవ్ర వ్యతిరేకత ఉందని , ఇటీవలి కాలంలో పవన్ కళ్యాణ్ బిజెపికి దగ్గరవడం ఆయనకు నచ్చ లేదని, 2014 లో కూడా బిజెపి తో జత కట్టినందుకే ఆయన పార్టీని వీడారని, 2016 లో పవన్ కళ్యాణ్ కమ్యూనిస్టులకు దగ్గరైన తర్వాత ఆయన మళ్లీ పార్టీలోకి వచ్చారని తెలుస్తోంది. ఒక రకంగా చెప్పాలంటే రాజు రవితేజ పార్టీని వీడడం పవన్ కళ్యాణ్ బిజెపికి దగ్గరవయాడని సూచిస్తోందని విశ్లేషకులు అంటున్నారు.
అయితే పవన్ కళ్యాణ్ బిజెపికి దగ్గరవయాడనే విశ్లేషణలు మరొక పక్క వైకాపా వర్గాలను కలవరపెడుతున్నాయి. పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్లి వచ్చినప్పటి నుండి వై ఎస్ ఆర్ సి పి కేంద్రం గా తీవ్ర విమర్శలు చేస్తూ ఉండటం, పవన్ కళ్యాణ్ వెనుక బిజెపి ఉండి ఈ విధమైన విమర్శలు చేయిస్తోంది అని వార్తలు రావడం, ఇటీవలి కాలంలో జగన్ ఢిల్లీ వెళ్లిన ప్రతిసారీ భంగపాటు కలగడం ఈ విశ్లేషణ లను బలపరుస్తోంది.
రాజు రవితేజ జగన్ కి దగ్గర అయ్యాడా?
ప్రత్యర్థి పార్టీల నేతలను, అధికార పార్టీలు తమ వైపు తిప్పుకోవడం అనేది ఇప్పుడు కొత్తగా జరుగుతోంది ఏమీ కాదు, అందుకు జగన్ మినహాయింపూ కాదు. రాజు రవితేజ సంచలన ఆరోపణలు చేసిన తర్వాత పవన్ కళ్యాణ్ ఆయన రాజీనామా పై స్పందించారు. పవన్ కళ్యాణ్ పేరిట విడుదలైన లేఖలో, ” ప్రస్తుతం జనసేన పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడిగా ఉన్న రాజు రవితేజ రాజీనామాను ఆమోదించాం. ఆయన పార్టీ పట్ల వ్యక్తం చేసిన అభిప్రాయాలను, వేదనను గౌరవిస్తున్నాం. గతంలో కూడా ఆయన ఇదే విధమైన బాధతో పార్టీని వీడి ఆ తర్వాత మళ్లీ పార్టీ లోకి వచ్చారు. ఆయన కు మంచి భవిష్యత్తు, ఆయన కుటుంబానికి శుభం కలుగజేయాలని ఆ జగన్మాతను ప్రార్థిస్తున్నాం” అంటూ వ్రాసుకొచ్చారు.
“జగన్మాత” పదం ఉద్దేశ పూర్వకంగా వాడిందే:
మొత్తానికి పవన్ కళ్యాణ్ రాసిన లేఖలో జగన్మాత అన్న పదం హైలెట్ అవుతోంది. రాజ రవితేజ జగన్ కు దగ్గర అవుతున్నాడు అనే విషయాన్ని జనసేన పార్టీ శ్రేణులకు అర్థమయ్యేలా చేయడం కోసం కావాలనే పవన్ కళ్యాణ్ ఆ పదాన్ని వాడినట్టు గా తెలుస్తోంది.
రానున్న రోజుల్లో రాజకీయాల్లో జరగనున్న పలు రకాల మార్పులకు ఇది కేవలం సూచన అని తెలుస్తోంది.