హైదరాబాద్: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మళ్ళీ ట్వీట్లు మొదలెట్టారు. గతవారం కేశినానిపై, సీమాంధ్ర టీడీపీ ఎంపీలపై ట్వీట్ల పరంపర కురిపించిన పవన్ ఈసారి కాంగ్రెస్‌పై పడ్డారు. 5 కోట్ల సీమాంధ్ర ప్రజలకు హామీ ఇచ్చిన ప్రత్యేక హోదాను పట్టించుకోకుండా లలిత్ మోడి అంశాన్ని పట్టుకుని బీజేపీపై పోరాడుతున్నందుకు కాంగ్రెస్ వారి ఉత్సాహం, కాంక్ష, శ్రధ్ధ తనకు పిచ్చిపిచ్చిగా నచ్చేశాయని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. ఇదే అంశంపై ఆయన ఇంతకుముందు ట్వీట్లలో సీమాంధ్రకు చెందిన టీడీపీ ఎంపీలను చెండాడిన విషయం తెలిసిందే.
ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధి ఈనెల 24న అనంతపురంలో పర్యటించటానికి వస్తున్న ఈ సమయంలో పవన్ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. మరోవైపు పవన్ సోదరుడు చిరంజీవికూడా రాహుల్ పర్యటనలో పాల్గొననున్నారని ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రఘువీరా రెడ్డి నిన్న ప్రకటించారు. అన్నట్లు చిరంజీవికూడా ఏపీ ఎంపీయే కదా(ఆయన ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు)! మరి ప్రత్యేకహోదాపై చిరు మౌనంమీద పవన్ ఏమీ మాట్లాడరేం!