హైదరాబాద్: మామూలుగానే పవన్ ఏమి చేసినా సంచలనం. దానికి తోడు ఇవాళ చంద్రబాబు నాయుడు భేటీకి బయలుదేరిన పవన్ తెల్ల పంచెను లుంగీగా కట్టి, పైన తెల్ల షర్ట్ వేసుకుని వెరైటీగా కనిపిస్తే ఇక చెప్పే పనేముంది. ఈ ఉదయం పవన్ ఆ డ్రస్‌లో విజయవాడకు బయలుదేరిన దగ్గరనుంచి మీడియా అంతా గగ్గోలు. ఈ తెల్ల పంచె ఏమిటి, దీని వెనక కథ ఏమిటి అంటూ…!
ఈ ప్రశ్నలకు పవన్ స్వయంగా సమాధానమిచ్చారు. తాను పూజలో ఉన్నందునే సీఎంతో భేటీకి పంచెలోనే వచ్చానని చెప్పారు. ఇవాళనుంచి కార్తీక మాసం కావటంతో పవన్ దానికి సంబంధించి పూజలో ఉన్నారని, ఉపవాసంలోకూడా ఉన్నారని తెలిసింది. తాను ఏకాదశి ఉపవాసాలు, పూజలు చేస్తానని పవన్ గతంలోకూడా చెప్పిన సంగతి తెలిసిందే. మొదట చంద్రబాబుతో కలిసి లంచ్ చేస్తారని వార్తలొచ్చినప్పటికీ, తర్వాత ఉపవాసం సంగతి బయటకు వచ్చింది. మరోవైపు గంటన్నర అనుకున్న భేటీ దాదాపు రెండున్నర గంటలపాటు సాగింది. సీఎం క్యాంప్ కార్యలయానికి మంత్రి కామినేని శ్రీనివాస్‌తో కలిసి వచ్చిన పవన్‌కు చంద్రబాబు, మంత్రి నారాయణ సాదరంగా స్వాగతం పలికారు. పవన్‌ను శాలువాతో సత్కరించి జ్ఞాపికనుకూడా బహూకరించారు. పవన్ వెంట ఆయన మిత్రుడు, సర్దార్ గబ్బర్ సింగ్ నిర్మాత శరత్ మరార్ కూడా ఉన్నారు. బయటకు వచ్చేటపుడు చంద్రబాబు ప్రభుత్వ ఉన్నతాధికారులు, ఐఏఎస్‌లను పవన్‌కు పరిచయం చేశారు. మీడియాతో మాట్లాడేటపుడు పవన్‌కు ఒకవైపు కామినేని శ్రీనివాస్, మరోవైపు విజయవాడ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు నిలుచుని ఉన్నారు.