జనసేన అధినేత పవన్ కల్యాణ్ బస్సుయాత్ర పాల్గొన్నారు. విజయనగరం జిల్లా ఎస్ కోటలో ఆయన మాట్లాడుతూ… ప్రత్యేక హోదాపై జనసేనకు చాలా స్పష్టత ఉందన్నారు! పట్టిసీమకు డబ్బుంటాయిగానీ, ఉత్తరాంధ్రలో ఎత్తిపోతలు పథకాలు చేపట్టడానికి ప్రభుత్వం దగ్గర నిధులుండవని విమర్శించారు. ఇలా చేస్తే ప్రాంతీయ అసమానతలు తప్ప ఇంకేమొస్తాయని వ్యాఖ్యానించారు. ఉత్తరాంధ్ర వెనకబాటుతనం తనకు బాగా తెలుసన్నారు. నిరుద్యోగ భృతిలాంటివి కంటితుడుపు చర్యలు మాత్రమేననీ, వీటిని నమ్మొద్దని అన్నారు.
తెలుగుదేశం నాయకులు ప్రతీ ఒక్కరూ జనసేనకు క్లారిటీ లేదని విమర్శిస్తుంటారని పవన్ అన్నారు. జనసేనకి చాలా స్పష్టత ఉందనీ, ముఖ్యమంత్రికి స్పష్టత లేదని వ్యాఖ్యానించారు. ప్రత్యేక హోదా గురించి మొదట్నుంచీ స్పష్టంగా మాట్లాడుతున్న ఏకైక పార్టీ జనసేన మాత్రమే అన్నారు. ప్రతిపక్ష నేత జగన్ కూడా క్లారిటీ లేదనీ, ఆయన ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి భయపడుతున్నారన్నారు. ఇక, టీడీపీకి హోదాపై స్పష్టత లేదన్న విషయాన్ని తాను కొన్ని వీడియోలను రిలీజ్ చేస్తానన్నారు. టీడీపీ నేతలు ఎంత క్లారిటీ లేకుండా మాట్లాడారో, ఎన్ని రకాలుగా మాటలు మార్చారో ప్రజలకు చూపిస్తా అన్నారు. జనసేన ఎంత స్పష్టంగా మాట్లాడిందో కూడా నిరూపిస్తా అన్నారు.
ఇక్కడ సమస్య ఏంటంటే… ప్రత్యేక హోదాపై ఎవరికి ఎంత స్పష్టత ఉందీ, ఎంత అవగాహనతో ఉందనేది కాదు కదా! ఎలా వస్తుందీ, ఏం చేస్తే కేంద్రంపై ఒత్తిడి పెరుగుతుందనేదే ముఖ్యం. అంతేగానీ… పవన్ కు ప్రత్యేక హోదాపై పరిపూర్ణ అవగాహన ఉందన్నమాత్రాన ప్రాక్టికల్ గా జరిగేది ఏముంటుంది..? ఇక, టీడీపీ నేతల కామెంట్స్ వీడియోలు రిలీజ్ చేస్తామంటున్నారు! హోదాకు బదులుగా కేంద్రం ప్యాకేజీ ప్రకటించిన సంగతి తెలిసిందే. హోదా సాధ్యం కాదనీ, ఇకపై ఏ రాష్ట్రాలకూ ఇచ్చేది లేదని కేంద్రం చెప్పడంతో.. ఆ ప్రయోజనాలను ప్యాకేజీ రూపంలో ఇస్తామంటే రాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకుంది. అయినాసరే, హోదా ఇచ్చి తీరాలీ, ప్యాకేజీ వద్దు అని ఎవరైనా అంటారా..? అలా అప్పట్లో తిరస్కరించి ఉంటే ఈ నాయకులే మరోలా విమర్శించేవారు కదా. ఆ సందర్భంగా, ప్యాకేజీకి అనుకూలంగానే ముఖ్యమంత్రి మొదలుకొని టీడీపీ నేతలు మాట్లాడారు.
కానీ, ఇస్తామన్న ప్యాకేజీ ఇవ్వకపోయేసరికి, అసాధ్యమన్న హోదాను ఇతర రాష్ట్రాలకు కొనసాగించే పరిస్థితులు ఉండేసరికి… టీడీపీ కేంద్రంతో ఢీ అంటే ఢీ అంది. ఈ క్రమమంతా ప్రజలకు చాలా స్పష్టంగా ఉంది. ఈ క్రమంలో టీడీపీ చేస్తున్న పోరాటం, కేంద్రంపై ఒత్తిడి పెంచేందుకు అనువుగా తీసుకుంటున్న నిర్ణయాలపై కూడా ప్రజలకు చాలా స్పష్టత ఉంది. జనసేనగానీ, వైకాపాగానీ ప్రత్యేక హోదా సాధన కోసం కేంద్రాన్ని స్పందింపజేసే సాహసోపేతమైన చర్యలు ఏవైనా చేపట్టగలిగాయా..? కనీసం, పోరాడుతున్న రాష్ట్ర ప్రభుత్వానికి మద్దతు ఇవ్వలేని పరిస్థితుల్లో ఈ పార్టీలు రాజకీయాలే ఆలోచిస్తున్నాయన్న స్పష్టతా ప్రజలకు ఉంది.