జనసేన అధినేత పవన్ కల్యాణ్.. తెలిసి చేస్తున్నారో..తెలియక చేస్తున్నారో కానీ.. ఉత్తరాంధ్ర ప్రజలకు ఏదో అన్యాయం జరిగిపోతుందనే ఓ భావనను.. వారి మనసుల్లో చొప్పించడానికి …. నోటికి ఎంత వస్తే అంత మాట్లాడేస్తున్నారు. రెండు రోజుల పాటు విశాఖ టౌన్లో రకరకాల ప్రదేశాలను పరిశీలిస్తున్నారు. శుక్రవారం..మధురవాడలోని ఫ్రాంక్లిన్ టెంపుల్టన్కు సంస్థకు కేటాయించిన భూములను పరిశీలించారు. అక్కడ తనను చూసేందుకు వచ్చిన ఫ్యాన్స్‌ను ఉద్దేశించి మాట్లాడారు. అక్కడ పవన్ కల్యాణ్ చేసిన ప్రధాన డిమాండ్.. ఐటీ కంపెనీల్లో ఉద్యోగాలు స్థానికులకే ఇవ్వాలని…!. సహజంగా పవన్ కల్యాణ్ ఏం మాట్లాడినా.. ఆయన ఫ్యాన్స్ ఈలలు వేస్తారు కాబట్టి.. అక్కడా అదే జరిగింది.
కానీ.. బోలెడన్ని పుస్తకాలు.. చదివి.. ఎప్పటికప్పుడు మేధావలతో సమావేశమమై.. తన ఆలోచనలను విశాలంగా చేసుకునే ప్రయత్నం చేసే పవన్ కల్యాణ్…తన డిమాండ్‌లో ఎంత ఇరుకుదనం ఉందో ఊరించలేకపోయారు. వస్తుతయారీ రంగంలో పరిశ్రమలు ఎక్కడైనా వస్తే.. స్థానికులకు ఉద్యోగాలివ్వాలనే డిమాండ్ ఎక్కడైనా ఉంటుంది. అందుకే తయారీ రంగాన్ని కాస్తంత వెనుకబడిన ప్రాంతాల్లో ఏర్పాటు చేయించడానికి ప్రయత్నిస్తున్నారు. అనంతపురం జిల్లాలో కియా పరిశ్రమ పెట్టడానికి అక్కడి యువతకు ఉపాధి కల్పించాలన్న ప్రధాన ఉద్దేశమే. ఆ సంస్థ కూడా శిక్షణ ఇచ్చి మరీ.. అక్కడి యువతకు ఉద్యోగాలిస్తోంది. కానీ సేవల రంగంలో అదెలా సాధ్యమవుతుంది…? ఐటీ సర్వీసెస్ మొత్తం సేవల రంగమే.. ఎంతో స్కిల్ ఉండి.. ఎప్పటికప్పుడు అప్ డేట్ అవుతూంటే తప్ప.. ఆ రంగంలో నిలబడటం కష్టం. అసలు అలాంటి డిమాండే అర్ధరహితం.
హైదరాబాద్, బెంగళూరు, పుణె, గుర్గావ్ లాంటి ప్రాంతాల్లో ఉన్న ఐటీ కంపెనీల్లో ఎంత మంది ఆయా రాష్ట్రాల వారు స్థానికులు ఉన్నారు. అక్కడెవరూ.. విశాఖ నుంచి వెళ్లిన యువకులు పని చేయడం లేదా..?. అమెరికాలో ఎంత మంది తెలుగువారున్నారు..?. అయినా పవన్ కల్యాణ్ ఇవన్నీ ఆలోచించే పరిస్థితుల్లో లేరు. తను అనుకున్నది చెప్పేస్తారు అంతే… ఆయన ఫ్యాన్స్ చప్పట్లు కొడతారు. ఆయనకు అది చాలు.
కొసమెరుపేమిటంటే… మధురవాడ సమీపంలోని ఓ మురికివాడనూ.. పవన్ కల్యాణ్ పరిశీలించారు. అక్కడే అదే స్థానికత నినాదం వినిపించారు. వెంటనే వారు పీకే భావజాలాన్ని నరనరానా ఎక్కించుకున్నారు. “హీరో వేషాలు స్థానికులకే ఇవ్వాలంటూ.”…నినాదాలు చేశారు. పవన్ కల్యాణ్‌కు ఏం అర్థమయిందో కానీ.. నవ్వుకుంటూ వెళ్లిపోయారు.
——- సుభాష్