పార్టీ నిర్మాణం ఇంకా పూర్తిస్థాయిలో జరగలేదు. పార్టీలో పవన్ కల్యాణ్ మినహా ఇతర నేతల పేర్లేంటో ప్రజలకు తెలీదు. కొత్తగా చేరుతున్న నాయకులు మైకులు పట్టుకుంటే… ప్రజలు నిలబడి వినే పరిస్థితి కూడా లేదు! అన్నిటికీ మించి, ఎన్నికలకు ఏడాదిలోపే సమయం ఉంది. పవన్ చేపట్టిన యాత్ర కొన్ని సెలవు దినాలు దాటుకుని ఇంకా మూడు జిల్లాలు దాటనేలేదు. వాస్తవ పరిస్థితి ఇలా ఉంటే.. జనసేనాని పవన్ కల్యాణ్ ప్రకటనలూ ప్రసంగాలు ఆకాశంలో ఉంటున్నాయి..! పెందుర్తి యాత్రలో పవన్ మాట్లాడుతూ… జనసేనకు బలం లేదని కొంతమంది నాయకులు అంటున్నారనీ, మీరంతా బలమా కాదా అంటూ ప్రజలను చూపించి చెప్పారు! మొదట్లో, పవన్ వస్తే జనం వస్తారని తన గురించి మాట్లాడారనీ, ఆ తరువాత పవన్ కు ఓ ఐదు సీట్లు రావొచ్చన్నారనీ, ఆ తరువాత 1 శాతం ఓట్లన్నారని పవన్ అన్నారు.
తాజాగా తనకు పది శాతం ఓట్లొస్తాయనే అంటున్నారనీ, మోడి కూడా ఆ పదిశాతంతోనే ప్రస్థానం ప్రారంభించారని పవన్ అన్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా పదిశాతం ఓట్లతోనే ప్రారంభించారన్నారు. వారి మాదిరిగానే పదిశాతంతోనే ప్రారంభమై అధికారం సాధిస్తామన్నారు. జనసేన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. అయితే, పవన్ స్పీచ్ లో ఓ మార్పు ఏంటంటే… తొలిదశ బస్సు యాత్ర చేస్తున్నప్పుడూ ఇప్పుడూ కూడా తాము అధికారంలోకి వస్తామనీ, అవకాశం ఇవ్వాలని ప్రజలను కోరుతున్నారు. రెండో విడత యాత్రకు వచ్చేసరికి.. కొత్తగా పవన్ చెబుతున్న మాటేంటంటే… తెలుగుదేశం పార్టీని మరోసారి అధికారంలోకి రానీయకుండా అడ్డుకుంటాం అంటున్నారు. తొలిదశ యాత్రలో కూడా టీడీపీపై పవన్ తీవ్రంగా విమర్శించినా.. టీడీపీని అడ్డుకుంటామనే మాట అనలేదు.
టీడీపీ వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వస్తుందా రాదా అనే చర్చ పక్కనపెడితే… సంస్థాగతంగా చూసుకుంటే, టీడీపీని నిలువరించగలిగే స్థాయిలో జనసేన ఉందా అనే అనుమానం కొంతమందిలో కలుగుతోంది. జనసేనకు ఇంకా నిర్మాణం జరగాల్సి ఉంది. బూత్ స్థాయి కమిటీల వరకూ ఇంకా వెళ్లలేదు. పైగా, పవన్ ఇవ్వాల్సిన మరో స్పష్టత ఏంటంటే.. టీడీపీని అడ్డుకోవడం అంటే, జనసేన సింగిల్ గా అడ్డుకుంటుందనా, చంద్రబాబును అడ్డుకునేందుకు కృషి చేస్తున్న ఇతరులకు మద్దతు ఇవ్వడం ద్వారా కూడా అడ్డుకుంటారనా..? ఓసారి, 175 స్థానాల్లోనూ పోటీ అనేస్తారు, వామపక్షాలతో పొత్తు అని మరోసారి అంటారు! రాష్ట్రంలోని అందర్నీ కలుపుకుని పోతారని కాసేపు అంటే, సింగిల్ గానే టీడీపీతో ఢీ కొడతా అన్నట్టు మాట్లాడతారు. ముందుగా ఈ కన్ఫ్యూజన్ నుంచి జనసేన బయటపడాలి. ఆ తరువాత, ఎవర్ని అడ్డుకోవాలన్నా, నిలువరించాలన్నా స్పష్టమైన వ్యూహాలు అవే వస్తాయి.