పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచారంలో ఆయన ఎక్కడికి వెళ్లినా జనం పోటెత్తారు. ఆ జన ప్రవాహాన్ని చూసి.. యువత కదనోత్సాహం చూసి..జనసేన పార్టీ.. నిర్ణయాత్మక శక్తిగా ఎదుగుతుందనే అంచనాలు రాజకీయ విశ్లేషకుల్లో వచ్చాయి. కానీ.. బయట జనసేన పార్టీకి ఉన్న ఆదరణకు.. వచ్చిన ఫలితాలకు పొంతన లేకుండా పోయింది. స్వయంగా పవన్ కల్యాణ్ కూడా ఓడిపోవాల్సి వచ్చింది.
రాజకీయాల్ని వంట బట్టించుకోని పవన్ ఫ్యాన్స్..!
పవన్ కల్యాణ్ సినిమాల్లో పవర్ స్టార్. తన సినిమాలతో యువతను విపరీతంగా ఆకర్షించిన వ్యక్తి. పవన్ కల్యాణ్ అడుగేస్తే.. అందులో మాస్ ను చూస్తారు ఫ్యాన్స్. అందుకే.. ఆయన ఏం చేసినా… ఈలలు, గోలలతోనే తమ మద్దతు తెలుపుతారు. రాజకీయాల్లో.. ఈలలు, గోలలు వర్కవుట్ కావు. ప్రజాసమస్యలపై మాట్లాడేటప్పుడు కావాల్సింది.. సంయమనం. నాయకుడు ఏం చెబుతున్నారో విని.. దానికి తగ్గట్లుగా స్పందించే కార్యకర్తలు ఉంటనే.. పరిణితి ఉన్నట్లు లెక్క. రైతు సమస్యలు, మహిళా సమస్యలు.. ఇలా ప్రజల సమస్యలు తెలుసుకునేటప్పుడు కూడా.. అభిమానులు ముందూ వెనుకా చూసుకోండా.. ఈలలు.. గోలలతో రెచ్చిపోవడంతో… పవన్ అప్పటి వరకూ పడిన శ్రమలో సీరియస్ నెస్ పోతోంది. ఇది జనసేన పట్ల.. సమస్యలు చెప్పుకునేవారిలోనూ.. కాస్తంత చులకన చేస్తోంది.
ఫ్యాన్స్‌ను కార్యకర్తలుగా మార్చలేకపోయిన జనసేనాని..!
పవన్ కల్యాణ్.. ప్రతీసారీ తన బలం బలగం అభిమానులేనని నేరుగా చెబుతూంటారు. అభిమానులే కార్యకర్తలు అవుతారు అని అనుకున్నారు కానీ అలా జరగలేదు. అభిమానులు అభిమానులుగానే ఉండిపోయారు. వారు ఏం చేసినా.. ఈలలు, గోలలతోనే మద్దతు తెలుపుతున్నారు. సినీ ఫ్యాన్స్.. రాజకీయ కార్యకర్తలుగా మారిన వాళ్లు తక్కువ. ఇప్పుడు అదే పాయింట్ ను పట్టుకున్నారు పవన్ కల్యాణ్. ఇప్పటి వరకూ పవన్ కల్యాణ్ ఇంత కాలం.. తన ఫ్యాన్స్‌ను.. రాజకీయ కార్యకార్తలుగా మార్చే దిశగా.. పవన్ పెద్దగా దృష్టి పెట్టలేదు. అలా చేయకపోవడం వల్ల.. దీర్ఘకాలంలో ముందుకు వెళ్లడం కష్టమని గుర్తించారు. ఇప్పుడు కావాల్సింది అరుపులు కేకలు కాదు… ఆలోచన అనే విషయాన్ని.. తన ఫ్యాన్స్ మనసుల్లోకి చొచ్చుకెళ్లేలా చేసేందుకు పవన్ ఇప్పుడు కొంత సీరియస్‌గా ప్రయత్నాలు ప్రారంభించారు.
ఇప్పుడు క్రమశిక్షణ నేర్పి లక్ష్యం దిశగా పయనిస్తారా..?
ఓటమి తర్వాత పవన్ కల్యాణ్‌కు కూడా.. అసలు లోపాలేంటో తెలిసి వచ్చే పరిస్థితులు ఏర్పడ్డాయి. ఎంత మంది అభిమాన గణం ఉన్నా… ఓట్లు వేయడానికి సిద్దగా ఉన్నా.. వారిని పోలింగ్ బూత్ వద్దకు తీసుకెళ్లే బలగం లేకపోతే… రావాల్సిన ఓట్లు కూడా రావని అర్థం అయింది. ఈ బలగాన్ని అభిమానుల నుంచే తయారు చేసుకోవాలంటే.. ముందుగా.. పార్టీ నిర్మాణాన్ని చేపట్టాలని ఆయన భావిస్తున్నారు. ఎక్కడెక్కడ పార్టీ నిలబడుతోందో.. గుర్తించి.. ఆ ప్రాంతాలకు ప్రత్యేకమైన వ్యూహాన్ని అమలు చేయాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. ఈ వ్యూహాలను ఇలా కొనసాగించగలిగితే.. ఆయన రాజకీయాల్లో నిలబడగలరు.