పెద్ద సినిమా వస్తోందంటే ఆ హడావుడే వేరుగా ఉంటుంది. ప్రమోషన్లు హోరెత్తుతాయి. హీరో, హీరోయిన్, దర్శక నిర్మాతలు, సంగీత దర్శకులు ప్రమోషన్ల కోసం పోటీ పడుతుంటారు. అయితే.. కాటమరాయుడుకి మాత్రం ఈ హడావుడి కనిపించడం లేదు. ఈ సినిమాకి ఎలాగూ ఆడియో ఫంక్షన్ లేదు. ప్రి రిలీజ్ ఫంక్షన్ మాత్రం చేశారు. ఇప్పుడు రిలీజ్ డేట్ దగ్గరపడిపోయింది. శుక్రవారం బొమ్మ పడిపోతోంది. ప్రి రిలీజ్ ఫంక్షన్ తప్ప ఒక్క ఈవెంట్ కూడా చేయలేదు చిత్రబృందం. ఇప్పుడు ఇంటర్వ్యూలకూ నో అంటోందట. పవన్ సొంత సినిమా ఇది. కాబట్టి పవన్ తప్పకుండా మీడియా ముందుకు వస్తాడని, సర్దార్ గబ్బర్ సింగ్ టైపులోనే ప్రమోషన్లకు ఏ లోటూ రాకుండా చూసుకొంటాడని అనుకొన్నారు. కానీ ఇప్పుడు మాత్రం పవన్ ‘నో ఇంటర్వ్యూ’ అంటున్నాడట.
మరోవైపు శ్రుతిహాసన్ కూడా అంతే. కారణమేంటో తెలీదు గానీ… కాటమరాయుడు టీమ్‌పై శ్రుతి కాస్త గుర్రుగానే ఉందట. అందుకే ఆడియో రిలీజ్ ఫంక్షన్‌కీ తాను రాలేదని, ఇప్పుడు కూడా.. ప్రమోషన్లకు హ్యాండ్ ఇవ్వడం ఖాయమని చెబుతున్నారు. కాటమరాయుడు షూటింగ్ పూర్తవ్వగానే చిత్రబృందంతో శ్రుతి హాసన్ అందుబాటులో లేకుండా పోయిందని, ఆమె ఫోన్లోనూ దొరకడం లేదని, శ్రుతి ప్రమోషన్లకు వచ్చే అవకాశాలే లేవని తెలుస్తోంది. పెద్ద సినిమా కదా, ప్రమోషన్లు లేకపోయినా జనం చూస్తారన్న నమ్మకం కావొచ్చు. లేదంటే పవన్ సినిమాకి ప్రమోషన్లే అవసరం లేదన్న ధీమా కూడా ఉండొచ్చు. ఇప్పటికే కాటమరాయుడు ఫీవర్ పీక్స్‌కి చేరింది. తొలి రోజు.. ఇండ్రస్ట్రీ రికార్డులు బద్దలవ్వడం ఖాయంగా కనిపిస్తోంది. అందుకే శరత్ మరార్ కూడా లైట్ తీసుకొని ఉంటాడు.