చిరంజీవి అభిమాన సంఘాల నాయకులు జనసేనలో చేరారు. హైదరాబాద్ లో జరిగిన ఓ కార్యక్రమంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ పలువురు చిరంజీవి అభిమాన సంఘాల నేతలకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా పవన్, తన అన్నయ్య మెగాస్టార్ గురించి మాట్లాడారు. తనకు ఎప్పటికీ ఇష్టమైన నటుడు చిరంజీవి అనీ, అందుకే తనకంటూ ప్రత్యేకంగా అభిమాన సంఘాలు పెట్టుకోలేదన్నారు. తన అన్నయ్య పక్కన సెక్యూరిటిగా నిలబడి పనిచెయ్యాలన్నది కోరిక అని పవన్ అన్నారు.
ఇక, జనసేన గురించి మాట్లాడుతూ.. ప్రాంతీయ పార్టీలో జాతీయ భావాలుండాలన్నది జనసేన సిద్ధాంతం అన్నారు. దేశ సమగ్రత దెబ్బతినకుండా, ప్రాంతాల మధ్య సమైక్యత కోసం పార్టీ పెట్టానన్నారు. పని చేసుకుంటూ వెళ్తుంటే అధికారం వెంట రావాలిగానీ, అధికారం కోసం వెంపర్లాడటం జనసేన సిద్ధాంతం కాదని పవన్ అన్నారు. సమస్యలపై పోరాటం చేసుకుంటూ వెళ్తే, సమస్యలున్న ప్రజల పక్షాన నిలబడితే, ఆరోజున ప్రజలు అధికారం ఇస్తారని పవన్ అభిప్రాయపడ్డారు. 2009లో తాను ఎంపీగానో, ఎమ్మెల్యేగానో పోటీ చేసే అవకాశం ఉందనీ, కానీ వద్దనుకోవడానికి కారణం ఉందన్నారు. ఒక చిన్న ఉద్యోగానికే శిక్షణ ఉన్నప్పుడు.. కోట్ల మంది ప్రజలకు సేవ చేయాలనుకుని వస్తున్నప్పుడు అవగాహన లేకుండా రావడం సరికాదని నిర్ణయించుకున్నా అన్నారు. అందుకే, ప్రతీదీ ఆచితూచి మాట్లాడతానని పవన్ అన్నారు.
సో.. సమస్యలపై పోరాటం చేసుకుంటూ పోతే.. అధికారం తనంతట తానే వస్తుందని పవన్ పేర్కొన్నారు. ఈ మాట వినగానే చాలామందిలో మెదిలే ప్రశ్న ఏంటంటే… జనసేన పోరాటం ఏదీ అని..? విభజన తరువాత రాష్ట్రం ఎన్ని రకాల సమస్యలను ఎదుర్కొంటోందో అందరికీ తెలిసిందే. ప్రత్యేక హోదా మొదలుకొని విభజన హామీలను కేంద్రం అమలు చేయడం లేదు. దీనిపై జనసేన చేసిన పోరాటం ఏంటనేది పవన్ స్పష్టంగా చెప్పాలి. ప్రత్యేక హోదాను అర్థం చేసుకుని మొదట్నుంచీ పోరాటం చేసింది తానేనని ఈ మధ్య పవన్ చెప్పుకున్నారు. కానీ, జనసేన ప్రయత్నం రాష్ట్రస్థాయి దాటి, కేంద్రాన్ని కదిలించగలిగిందా అనేదే కదా ప్రాతిపదిక! ఉద్దానం లాంటి ఒకట్రెండు సమస్యలు రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారు. అది మెచ్చుకోదగ్గ అంశమే.
టీడీపీతో విభేదించిన దగ్గర నుంచీ పోరాటం అనే యాంగిల్ పోయి… ఫక్తు ఎన్నికల ప్రచారమే కదా జనసేన చేస్తున్నది! తాము అధికారంలోకి వస్తే అది చేస్తాం, ఇది చేస్తాం అని పవన్ హామీలు ఇస్తున్నారు. మరి, పవన్ లెక్క ప్రకారం… పోరాటం చేసుకుంటూ పోతేనే కదా ప్రజలు అధికారం ఇచ్చేది! ఈ సూత్రీకరణ ప్రకారం ఇప్పుడు జనసేన పోరాట పంథాలో ఉందా, ఒక సాధారణ రాజకీయ పార్టీగా ఎన్నికల హడావుడిలో అధికార యావతో కొట్టుకుపోతోందా అనేది వారే ఆత్మవిమర్శ చేసుకోవాలి.