ఎల్జీ పాలిమర్స్ ఘటనపై ఆందోళనలు చేస్తే.. కరోనా వ్యాపిస్తుందని.. అందుకే.. ఆందోళనలు చేయవద్దని కొద్ది రోజుల కిందట పిలుపునిచ్చిన జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఇప్పుడు మనసు మార్చుకున్నారు. బాధితుల విషయంలో ప్రభుత్వం సక్రమంగా స్పందించకపోతే ఉద్యమిస్తామని హెచ్చరికలు జారీ చేశారు. విష వాయువు ప్రభావిత ప్రాంత ప్రజలకు జనసేన అండగా నిలుస్తుందన్నారు. స్టైరిన్ ప్రజాజీవితంపై దుష్ప్రభావం చూపిందని .. ప్రభుత్వ తీరు బాధిత ప్రజలకు ధైర్యం ఇచ్చేలా లేదన్నారు.
విశాఖ జిల్లా జనసేన నేతలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడిన పవన్.. స్టైరిన్ బాధితుల కోసం ఉద్యమం చేస్తామని ప్రకటించారు. డాక్టర్ సుధాకర్ విషయంలో ప్రభుత్వం వ్యవహరించిన తీరుపైనా…పవన్ కల్యాణ్ అసహనం వ్యక్తం చేశారు. అధికార పార్టీ నేతలు అసెంబ్లీ, బహిరంగ వేదికలపై అసభ్య పదజాలం వాడారని.. వారిపై పని చేయని చట్టం డాక్టర్ సుధాకర్ పై మాత్రం బలంగా పని చేసిందని ఎద్దేవా చేశారు.
విలువైన ప్రభుత్వ భూముల్ని వేలం వేసేందుకు ప్రభుత్వం సిద్ధమైందని… ఆ భూముల వాస్తవ విలువలు ప్రజలకు తెలియాలన్నారు పవన్ కల్యాణ్. మద్యనిషేధం విషయంలో ప్రభుత్వ తీరునూ ఖండించారు. లాక్ డౌన్ కారణంగా హైదరాబాద్‌కే పరిమితమైన పవన్ కల్యాణ్ జిల్లాల వారీగా నేతలతో వీడియో కాన్ఫరెన్స్ సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఏం చేయాలన్నదానిపై దిశానిర్దేశం చేస్తున్నారు.