అమరావతి రైతుల్ని ఆదుకోవాలంటే.. రాజధాని తరలి పోకుండా ఉండాలంటే.. బీజేపీతో కలిసి పోరాడటమే శరణ్యమని పవన్ కల్యాణ్ భావించినట్లుగా తెలుస్తోంది. ఈ మేరకు బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డాతో చర్చలు జరిపారు. అవి సఫలమైనట్లుగా తెలుస్తోంది. ఏపీలో ఉన్న రాజకీయ పరిస్థితుల దృష్ట్యా కలసి పోరాడాలని నిర్ణయించుకున్నారు. ఇక నుంచి జరిగే కార్యక్రమాలన్నీ ఉమ్మడిగా నిర్వహిస్తారు. జేపీ నడ్డాతో జరిగిన సమావేశాల్లో పవన్ కల్యాణ్.. అమరావతిలో ప్రభుత్వం చేస్తున్న ఆణచివేతతో పాటు… రాష్ట్రంలో రౌడీ రాజ్యం ఎలా ఉందో వివరించినట్లుగా తెలుస్తోంది. కాకినాడలో వైసీపీ దాడుల దృశ్యాలతో పాటు… అక్కడ దాడి చేసిన వారిని వదిలి పెట్టి.. జనసైనికులపైనే కేసులు పెట్టిన విషయాన్ని నడ్డాకు పవన్ వివరించినట్లుగా జనసేన వర్గాలు చెబుతున్నాయి.
అమరావతిలో ఏం జరుగుతుందో.. మొత్తం తమకు తెలుసని.. .. ఎప్పటికప్పుడు సమాచారం తెప్పించుకుంటున్నామని.. దీనిపై.. మేథోమథనం చేస్తున్నట్లు నడ్డా చెప్పినట్లుగా తెలుస్తోంది. రెండు పార్టీలు కలిసి ఓ ఉమ్మడి ప్రకటన చేసే అవకాశం ఉంది. కొద్ది రోజుల కిందట.. బీజేపీతో తాను ఎప్పుడూ దూరంగా లేనని పవన్ కల్యాణ్ ప్రకటించారు. అయితే.. రాష్ట్ర బీజేపీతో మాత్రం… ప్రత్యేక హోదా విషయంలో విబేధించిన తర్వాత కలిసి పని చేయలేదు. దీనికి కారణం.. బీజేపీ నేతలు.. పవన్‌తో.. స్నేహం కోరుకుటున్నప్పటికీ.. అది.. విలీనమే కావాలని చాలా కాలంగా అడుగుతున్నారు. ఆ బాధ్యతను రామ్‌మాధవ్ తీసుకుని పలుమార్లు.. పవన్ తో చర్చలు జరిపారు.
అమెరికాలోనూ దీనిపై.. పవన్ తో భేటీ అయ్యారు. తన పార్టీని విలీనం చేయాలని అడుగుతున్నారని.. కానీ చేయబోనని.. పవన్ చాలా సార్లు చెప్పారు. ఇప్పుడు.. బీజేపీతో కలిసి పని చేసేందుకు సిద్ధమయ్యారు. ఏపీలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీతో కలిసి జనసేన పోటీ చేసే అవకాశం ఉంది. అసెంబ్లీ ఎన్నికల్లో.. కమ్యూనిస్టులతో కలిసి పోటీ చేసిన పవన్ కల్యాణ్ ఫలితాన్ని పొందలేకపోయారు. ఇప్పుడు.. బీజేపీతో కలిసి నడుస్తున్నారు.