ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చాలా రోజుల తర్వాత బయట బహిరంగసభలు పెడుతున్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగాల్లో చంద్రబాబు, పవన్‌లను వ్యక్తిగతంగా తిడుతున్నారు. దెయ్యాలు, రాక్షసులు,గుండెపోటు వస్తుంది అంటూ దండకం చదువుతున్నారు. దీనిపై పవన్ కల్యాణ్ ఘాటుగా రియాక్ట్ అయ్యారు. ప్రభుత్వ విధానాలు, పాలసీల గురించి మాట్లాడితే వ్యక్తిగతంగా రాక్షసుడు, దుర్మార్గుడు అని దూషిస్తున్నారని మండిపడ్డారు. వ్యక్తిగతంగా దూషణలకు దిగితే వాటిని ఎలా ఎదుర్కోవాలో బాగా తెలుసన్న జనసేనాని నోటికి వచ్చినట్లు మాట్లాడి సహనాన్ని పరీక్షించ వద్దని హెచ్చరించారు.
కరెంట్ కోతల్లో ప్రభుత్వ వైఫల్యాన్ని పవన్ కల్యాణ్ గట్టిగా ప్రశ్నించారు. పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ల రద్దు నుంచి పరిశ్రమలకు పవర్ హాలీడే ప్రకటించే వరకు వైసీపీ అనాలోచిత విధానాలతో ఎలా మోసం చేస్తోందో ప్రజల్లోకి తీసుకెళ్లాలని జనసైనికులకు సూచించారు. భవన నిర్మాణ కార్మికుల సమస్యల నుంచి పెరిగిన విద్యుత్ ఛార్జీల వరకు ప్రజల పక్షానే పోరాటం చేస్తున్నామన్నారు. ఉద్యోగులు రోడ్డెక్కడానికి, కౌలు రైతుల ఆత్మహత్యలకు కారణం మీ విధానాలే కారణం కాదా అని జగన్‌ను ప్రశ్నించారు. కోతల కారణంగా పరిశ్రమలు వారానికి రెండు రోజులు మూతపడనున్నాయని దీని వల్ల ఉపాధి అవకాశాలు పోతాయన్నారు .
కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టిన పారిశ్రామికవేత్తలు విద్యుత్ కోతలతో నష్టాల పాలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పారిశ్రామిక అభివృద్ధికి విఘాతం కలుగుతుందని…36 లక్షల మంది కార్మికుల ఉపాధిపై ప్రభావం పడే ప్రమాదం ఉందన్నారు. ప్రభుత్వ చేతకాని తనం వల్లే ఈ పరిస్థితికి ఏపీకి వచ్చిందని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. ప్రభుత్వ పాలసీల్ని ప్రశ్నిస్తే వ్యక్తిగతంగా తిట్టడం ఏమిటన్న వాదన అన్ని వర్గాల నుంచి వస్తోంది.ఇక నుంచి అలా తిడితే ఊరుకోమని పవన్ హెచ్చరించడంతో ముందుముందు పరిస్థితి ఎలా ఉంటుందోనన్న ఆసక్తి జనసేనలో వ్యక్తమవుతోంది.