” ఎంత భావ వైరుధ్యాలున్నా.. రాజకీయ విమర్శలు చేసుకున్నా వాటిని కళకు, సంస్కృతికి అంటనీయకపోవడం తెలంగాణ రాజకీయ నేతల శైలి ” ఇది పవర్ స్టార్ పవన్ కల్యాణ్ … తెలంగాణ మంత్రి కేటీఆర్‌కు రాసిన లేఖలో సూటిగా చెప్పిన మాట. ఇందులో డైరక్ట్ అర్థమే ఉంది కానీ తెలంగాణ నేతలకు అని ప్రత్యేకంగా చెప్పడం వల్ల ఇక్కడ ప్రస్తుత పరిణామాలను విశ్లేషించుకోవాల్సిన పరిస్తితి వచ్చింది. ఏపీలో సినిమా రంగాన్ని రాజకీయ కారణాలతో ఎలా వేధిస్తున్నారో కళ్ల ముందు కనిపిస్తోంది. స్వయంగా భీమ్లా నాయక్ సినిమాకే చుక్కలు చూపిస్తున్నారు.
దీనికి రాజకీయ కారణాలేనని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. రాజకీయం పేరుతో సినిమాలపై కక్ష సాధించడాన్ని పవన్ ఇలా కేటీఆర్‌కు ఇచ్చిన ప్రశంసల ద్వారా తప్పు పట్టారన్నమాట. ” కళను అక్కున చేర్చుకొని అభినందించడానికి కుల, మత, భాష, ప్రాంతీయ బేధాలుండవు. అంతే కాదు భావ వైరుధ్యాలు అడ్డంకి కాబోవు. ఈ వాస్తవాన్ని మరోమారు తెలియజెప్పిన తెలంగాణ రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖా మంత్రి కల్వకుంట్ల తారక రామారావు గారికి నిండైన హృదయంతో కృతజ్ఞతలు తెలియజేస్తున్నా’’ అని పవన్ లేఖలోపేర్కొన్నారు.
ప్రస్తుత హరియాణ గవర్నర్ బండారు దత్తాత్రేయ ప్రతి ఏటా నిర్వహించే అలయ్ బలయ్ కార్యక్రమంలో అన్ని పక్షాలవారు ఆత్మీయంగా ఉండటాన్ని చూశాం. అటువంటి ఆత్మీయత కె.టి.ఆర్. లో ప్రస్పుటంగా కనిపిస్తుందన్నారు పవన్ కల్యాణ్. మొత్తంగా టీఆర్ఎస్పైనా పవన్ కల్యాణ్ గతంలో విమర్శలు చేశారు. రాజకీయంగా విభేదిస్తున్నారు. బీజేపీతో కూడా పొత్తు పెట్టుకున్నారు. అయినా ఆయనపై తెలంగాణలో కక్ష సాధింపులేమీ లేవు. అందుకే పవన్‌కు తెలంగాణ నేతలపై ఉన్నతమైన అభిప్రాయం ఏర్పడటంలో కూడా వింత లేదు.