ఆంధ్రప్రదేశ్ లో మరో యాత్ర మొదలౌతోంది. ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి ప్రారంభించిన ప్రజాచైతన్య పాదయాత్ర దాదాపు చివరి దశలకు చేరుకున్న సమయంలో… జనసేన అధినేత పవన్ కల్యాణ్ జనంలోకి వస్తున్నారు. నేటి నుంచి బస్సు యాత్ర ప్రారంభిస్తున్నారు. శనివారం సాయంత్రమే ఇచ్ఛాపురానికి పవన్ చేరుకున్నారు. ఈరోజు ప్రారంభమౌతున్న బస్సుయాత్ర జిల్లాలోని అన్ని నియోజక వర్గాల మీదుగా సాగుతుంది. ఉత్తరాంధ్రలో 17 రోజులపాటు బస్సుయాత్ర ఉంటుంది. రాష్ట్రవ్యాప్తంగా 28 రోజుల్లో పవన్ పర్యటించబోతున్నారు. ప్రత్యేక హోదాపై ప్రజల్లో అవగాహన కల్పించడంతోపాటు, స్థానిక సమస్యలపై ప్రధానంగా స్పందించే అవకాశం ఉంది.
పవన్ కూడా రంగంలోకి దిగడంతో రాష్ట్రంలో పూర్తి ఎన్నికల వాతావరణం నెలకొనబోతోంది. టీడీపీ ధర్మపోరాట సభలు, జగన్ పాదయాత్ర, పవన్ బస్సుయాత్ర… ఏపీ రాజకీయాల్లో కావాల్సినంత హడావుడి! అయితే, ప్రస్తుతం పవన్ యాత్ర విషయానికొస్తే… ఏపీ రాజకీయాల్లో కొత్త సమీకరణకు నాంది పలికే అవకాశం ఉందనే చెప్పాలి. పార్టీపరంగా చూసుకుంటే, ఈ యాత్ర ద్వారా జనసేన కేడర్ ను తయారు చేసుకోవడం ఒక లక్ష్యం. నాలుగేళ్లుగా పార్టీ నిర్మాణానికి సరైన పునాదులు ఇప్పటివరకూ పడలేదనే చెప్పాలి. ఈ యాత్ర ద్వారా క్షేత్రస్థాయి వరకూ కమిటీలను ఏర్పాటు చేసుకుంటారని జనసేన వర్గాలు ధీమాగానే చెబుతున్నాయి.
పవన్ కల్యాణ్ దూరం కావడం టీడీపీకి లాభమా నష్టమా అనే చర్చ కొన్నాళ్లుగా జరుగుతూనే ఉంది. ప్రస్తుత బస్సుయాత్రలో కూడా పవన్ టీడీపీని తీవ్రంగానే విమర్శిస్తారు కాబట్టి… అభిమానులు కూడా టీడీపీని పూర్తిగా వ్యతిరేకిస్తారా, లేదా గత నాలుగేళ్లుగా ఒక పార్టీగా జనసేన పనితీరును, ఒక నాయకుడిగా పవన్ పనితీరుని విశ్లేషించి చూసుకుంటారా అనేది కీలకం కాబోతోంది. గత ఎన్నికల్లో చాలా నియోజక వర్గాల్లో పవన్ అభిమానులు టీడీపీకి ప్లస్ అయిన మాట వాస్తవం. అయితే, 2014 తరువాత నాలుగేళ్లపాటు పవన్ పనితీరును అందరూ చూశారు. ప్రత్యేక పరిస్థితుల నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య విభేదాలు తలెత్తడం, ఈ క్రమంలో రాష్ట్ర ప్రయోజనాలు నలిగిపోతూ ఉండటం.. ఈ నేపథ్యంలో వివిధ పార్టీల అధినేత వ్యవహార శైలి, పోరాట పటిమను కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఈ పరిస్థితుల మధ్య పవన్ యాత్ర మొదలుకాబోతోంది. పవన్ ను అభిమానించాం కాబట్టి, ఆయన దేన్ని వ్యతిరేకిస్తే మనమూ దాన్ని వ్యతిరేకిద్దాం అభిమానులు అనుకుంటే… వచ్చే ఎన్నికల్లో టీడీపీపై దాని ప్రభావం కొంత ఉండే అవకాశం ఉంటుంది. ఎందుకంటే, గత ఎన్నికల్లో పవన్ చెప్పారని టీడీపీకి మద్దతు ఇచ్చినవారి వైఖరిలో మార్పు వస్తుంది కాబట్టి. లేదూ… ఆ పరిధి దాటి ఇతర అంశాలనూ పరిగణనలోకి తీసుకుని ఆలోచించి, విశ్లేషించుకుంటే మరో రకమైన రాజకీయ సమీకరణాలకూ అవకాశం ఉంటుంది. ఏదేమైనా, ఆంధ్రా రాజకీయాల్లో పవన్ యాత్ర కీలకం కాబోతోందని మాత్రం చెప్పొచ్చు.