ప్రత్యేక హోదా అనే మాట కూడా వినపడకూడదు అని పంతం పట్టుకుని కూర్చున్నాడు చంద్రబాబు. ప్రజా వ్యతిరేకత వచ్చినా సరే….ఈ విషయంలో మాత్రం మోడీకి అనుకూలంగా ఉండడానికే నిర్ణయం తీసుకున్నాడు చంద్రబాబు. ఆయన అనుకూల మీడియా కథ కూడా సేం టు సేం. మామూలుగా అయితే ఇలాంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న ఎవ్వరూ కూడా ఏమీ చేయలేరు. కానీ వైఎస్ జగన్, పవన్‌లకు మాత్రం ఆ ఛాన్స్ ఉంది. ఇద్దరికీ కూడా అభిమాన బలం ఉంది. కానీ ప్రత్యేక హోదా ఇవ్వని నరేంద్రమోడీని జగన్ ఎప్పుడూ ఏమీ విమర్శించడు, అలాగే ప్రత్యేక హోదా విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ద్రోహం చేస్తున్న చంద్రబాబుని పవన్ విమర్శించడు. ఈ కారణం వళ్ళనే ఎక్కువ మంది ప్రజలు వీళ్ళను నమ్మే పరిస్థితి కూడా కనిపించడం లేదు. తనపైన వస్తున్న విమర్శలకు చెక్ పెట్టడానికి రెడీ అయ్యాడు పవన్. ప్రత్యేక హోదా కోసం జగన్‌తో కలిసి పోరాడటానికి సిద్ధమని ప్రకటించాడు. వైఎస్ జగన్‌తో కలిసి పవన్ వేదిక పంచుకున్నాడంటే అంతటితో చంద్రబాబుకు శతృవు అయినట్టే లెక్క. అయినప్పటికీ పవన్ మాత్రం ‘చంద్రబాబు బంటు’ అన్న ముద్రను చెరిపేసుకోవడానికి నిర్ణయం తీసుకున్నాడు. జగన్‌తో కలిసి పోరాడటానికి సిద్ధం అన్న పవన్ వ్యాఖ్యలకు ప్రశంశలు దక్కుతున్నాయి.
ఇప్పుడిక బాల్ జగన్ కోర్టులో ఉంది. పవన్ కళ్యాణ్‌పైన చంద్రబాబు బినామీ నేత అన్న ముద్ర వేయడానికి వైకాపా అనుకూల మీడియా, వైకాపా నేతలు చాలా ప్రయత్నాలే చేశారు. మరి ఇప్పుడు అదే పవన్….చంద్రబాబుకు వ్యతిరేకంగా జగన్‌తో పోరాటానికి సిద్ధమంటున్నాడు. మరి జగన్ ముందుకొస్తాడా? ప్రత్యేక హోదా కోసం పోరాటం చేయడం ద్వారా పొలిటికల్ మైలేజ్ మాత్రమే కోరుకుంటున్నాడా? లేక నిజంగానే ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా రావాలన్న చిత్తశుద్ధి జగన్‌కి ఉందా అన్న విషయం కూడా ఇఫ్పుడు తేలిపోతుంది. పవన్-జగన్‌లు ఒకే వేదికను పంచుకున్నారంటే చంద్రబాబు-మోడీలు ఇద్దరినీ కూడా ఘాటుగా విమర్శించాల్సిన పరిస్థితి ఉంటుందనడంలో సందేహం లేదు. అదే జరిగితే ప్రత్యేక హోదా ఉద్యమ స్ఫూర్తి ప్రజలందరిలోనూ కలుగుతుంది. మీడియా కూడా కచ్చితంగా హోదా ఉద్యమానికి అనుకూలంగా పని చేయాల్సిన పరిస్థితి వస్తుంది. టిడిపి-బిజెపి పార్టీల పైన వ్యతిరేకత కూడా అంతకంతకూ పెరుగుతుంది. అదే జరిగితే బాబు-మోడీల ఆలోచనా తీరు కచ్చితంగా మారుతుంది. హోదా, రైల్వే జోన్‌తో సహా ఆంధ్రప్రదేశ్‌కి ఇస్తామన్న ప్రయోజనాలన్నీ ఇవ్వకపోతే కాంగ్రెస్‌కి పట్టిన గతే బిజెపి, టిడిపిలకు కూడా పడుతుంది అన్న క్లియర్ మెస్సేజ్ వెళితే చాలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇప్పుడు కల్పిస్తున్న ప్రయోజనాలకంటే చాలా ఎక్కువ స్థాయిలోనే న్యాయం చేస్తారనడంలో సందేహం లేదు. రాజకీయ స్వార్థాన్ని, విభేదాలను పక్కన పెట్టి పవన్‌తో కలిసి పనిచేయడానికి జగన్ ముందుకు వస్తాడా?