పవన్ కల్యాణ్ కొత్త సినిమా టైటిల్ ఏమిటన్న ఉత్కంఠతకు తెర పడింది. పవన్ – డాలీల కలయికలో రూపుదిద్దుకొంటున్న చిత్రానికి ‘కాటమరాయుడు’ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. రేపు (సెస్టెంబరు 2)న పవన్ కల్యాణ్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా టైటిల్ని అధికారికంగా ప్రకటించారు. ఈ చిత్రానికి కడప కింగ్ అనే పేరు పెట్టినట్టు ఇది వరకు ప్రచారం జరిగింది. అయితే చిత్రబృందం మాత్రం ”కడప కింగ్ అనే పేరు ఎవరు అనుకొన్నారో, ఎందుకు అనుకొన్నారో తెలీదు. అసలు ఆ టైటిల్నే మేం పరిశీలించలేదు” అని స్పష్టం చేసింది. ఈనెలాఖరున కాటమరాయుడు కొత్త షెడ్యూల్ని మొదలెడతారు. నిజానికి నవంబరునాటికి షూటింగ్ పూర్తి చేయాలని చిత్రబృందం భావించింది. కానీ… పవన్ జన సేన పార్టీని, తన సిద్దాంతాలనూ జనంలోకి తీసుకెళ్లాలని నిర్ణయించుకొన్నందున, బహిరంగ సభల్ని ఏర్పాటు చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నందున కాటమరాయుడు షూటింగ్ సజావుగా సాగే అవకాశాలు కనిపించడం లేదు. రాష్ట్ర రాజకీయాల్ని బట్టి.. షూటింగ్ అటూ ఇటూ అవ్వొచ్చు. ఈ యేడాదికి కాటమరాయుడు షూటింగ్ పూర్తయితే గ్రేటే. అన్నట్టు పుట్టిన రోజున పవన్ హైదరాబాద్లో ఉండడం లేదు. పవన్ తన పుట్టినరోజుని కుటుంబ సభ్యుల మధ్య జరుపుకొంటున్నాడని తెలుస్తోంది.