ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి చారిత్మక విజయం సాధించింది. వైసీపీ రెక్కలు విరిచి కనీసం ప్రతిపక్ష హోదా లేకుండా చేసింది. ఐదేళ్ళుగా వున్న ఆగ్రహాన్ని ఓట్ల రూపంలో చూపించి జగన్ కి చెంపదెబ్బ కొట్టారు ప్రజలు. నియంత జగన్ ని అధ:పాతాళానికి తొక్కకపొతే నా పేరు పవన్ కళ్యాణ్ నే కాదు.. నా పార్టీ జనసేనే కాదని ప్రతిజ్ఞ చేసిన పవన్ కళ్యాణ్.. చెప్పినట్లు జగన్ ని గద్దె దించడంలో కీలక భూమిక పోషించారు. పిఠాపురం నుంచి బరిలో నిలిచిన పవన్ కల్యాణ్ ఘన విజయాన్ని సాధించి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.
పవన కళ్యాణ్ కు ఈ ఎన్నిక, విజయం చాలా ప్రత్యేకం. గత ఎన్నికల్లో రెండు చోట్ల పోటి చేసి ఓటమి చవిచూసిన జనసేనాని గొప్ప మనోధైర్యంలో ఐదేళ్ళపాటు పార్టీని నడిపి ప్రజలతో కలసి ప్రయాణం చేశారు. ‘అధ్యుక్షుడే ఓడిపోయిన పార్టీ’ అని వైసీపీ దారుణంగా హేళన చేసింది. రాజకీయాల్లో ఏది శాశ్వతం కాదనే విశ్వ సత్యాన్ని మరచి కించపరిచింది. అయితే ఎంతో గుండెనిబ్బరంతో విమర్శల్ని, అవమానాలని ఎదుర్కొని ముందుకు కదిలారు పవన్. ఈ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ఎక్కడి నుంచి పోటి చేస్తారో అని తెలుగు రాష్ట్రాల ప్రజలు ఆసక్తిగా ఎదురుచూశారు. పిఠాపురం నుంచి ఆయన పోటీ ఖరారైయింది. అప్పటి నుంచి పిఠాపురం పేరు విశేషంగా వార్తల్లో నిలిచింది.
గత ఎన్నికల పరాజయం నుంచి పాఠాలు నేర్చుకున్న పవన్ కళ్యాణ్.. ఈసారి చాలా పగడ్బందీగా ఎన్నికల ప్రణాళికని రచించారు. తనకు ఎంత గొప్ప సినిమా గ్లామర్ ఉన్నప్పటికీ ఒక సామాన్య అభ్యర్ధిలానే ఊరూరా తిరిగారు. పిఠాపురం అభివృద్ధి కోసం ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేసి ఊరూరా ప్రచారం చేశారు. అందరిని కలుపుకున్నారు. కూటమిలో భాగంగా టీడీపీ కూడా పవన్ విజయంలో ప్రముఖ పాత్ర పోషించింది. అన్నిటికంటే ముఖ్యంగా ప్రజలు పవన్ కళ్యాణ్ గెలవాలని బలంగా కోరుకున్నారు. కోరుకున్నట్లే గెలిపించారు.
పదిహేనేళ్ల రాజకీయ ప్రస్థానంలో తొలిసారి ఓ విజయం చూశానని భావిద్వేగానికి గురయ్యారు జనసేనాని. ఆయనే కాదు. ఆయన్ని అభిమానించే ప్రజల్లో కూడా అదే ఎమోషన్ వుంది. అద్భుత విజయం వరించింది. జనసేనకి ఇప్పుడు 21 సీట్లు వున్నాయి. గొప్ప భవిష్యత్ కి ఇది అద్భుత నాంది. అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ ముందు చాలా లక్ష్యాలు వున్నాయి. అందులో ఒకటి జనసేనానికి ఒక బలమైన కంచుకోట కావాలి.
దేశంలో పార్టీ అధినేతలందరికీ తమ స్థానానికి అంటూ బలమైన కంచుకోట వుంటుంది. అక్కడ నుంచి పోటీ చేస్తే గెలుపు తధ్యం. అంత దృడంగా నియోజకవర్గాన్ని మలుచుకొని వుంటారు. చంద్రబాబుకు కుప్పం, జగన్ కు పులివెందుల, కేసీఆర్ గజ్వేల్, జాతీయ రాజకీయాల్లో చూసుకుంటే గాంధీ కుటుంబానికి అమేథి ఇలా చెప్పుకుంటూ పొతే ఎన్నో స్థానాలు కనిపిస్తాయి. ఇప్పుడు పవన్ కు కూడా అలాంటి కంచుకోట లాంటి స్థానం కావాలి. పిఠాపురాన్ని అలాంటి కోటగా మలుచుకొవడానికి ఇది గొప్ప అవకాశం.
పవన్ కళ్యాణ్ ని జగన్ దత్త పుత్రుడని హేళన చేస్తూ పిలిచేవారు. జగన్ కు హిందూ ఆధ్యాత్మిక అంశాలపై పట్టులేకపోవడం వలన ‘దత్త’ అనే మాటని వేళాకోళంగా వాడేవరేమో కానీ ఆ పదంలోని మహత్తు గొప్పగా ఫలించింది. పిఠాపురం దత్తాత్రేయస్వామి నిలయం. దేవుని స్క్రిప్ట్ ప్రకారం పవనే దత్తాత్రేయ పుత్రుడిగా వచ్చారని అక్కడి ప్రజలు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇలా దేవుడి స్క్రిప్ట్ తో ముడిపడిన ఈ స్థానాన్ని పవన్ పదికాలాలు పదిలంగా కాపాడుకోవాలి. ఇలా కాపాడుకోవడం పవన్ చేతుల్లోనే వుంది.
పవన్ అగ్ర కథానాయకుడు. వృత్తిరిత్యా ఆయన సినిమాలు ఆయనకి వుంటాయి. ఆయన జనసేన పార్టీకి అధినేత. ఇప్పుడు ఎమ్మెల్యే అయ్యారు. కూటమిలో భాగంగా ఆయన చంద్రబాబు క్యాబినెట్ లో మినిస్టర్ గా చేరవచ్చు. ఇలా ఆయనపై ఎన్ని బాధ్యతలు ఉన్నప్పటికీ ఆయన్ని గెలిపించిన పిఠాపురం తొలి ప్రాధన్యత కావాలి. పిఠాపురంను రోల్ మోడల్ నియోజక వర్గంగా మారుస్తానని, కొన్ని పరిశ్రమలు తీసుకొస్తానని, ప్రతిపల్లెని అభివృద్ధి పధంలో నడుపుతాని మాటిచ్చారు పవన్. ఆ హామీలను నెరవేర్చే దిశగా పని చేయాలి. అలాగే నియోజకవర్గంలో ఎక్కువ సమయాన్ని గడపాలి. పార్టీ కార్యకలాపాలకు కేంద్ర బిందువుగా చేయాలి. కూటమిలో భాగంగా టీడీపీ సహజంగానే ఆయన గెలుపునకు చాలా కృషి చేసింది. భవిష్యత్ ఎన్నికల్లో రాజకీయ సమీకరణాలు ఎలా ఉన్నప్పటికీ పవన్ పిఠాపురం ప్రజలందరి మన్ననలని పొందాలి. ముఖ్యంగా ప్రజలు ఏ ఉద్దేశంతో ఆయన్ని అక్కడ గెలిపించారో, వారి ఆశలు, ఆశయాలని నెరవేర్చే విధంగా నడుచుకోవాలి. పవన్ చేతిలో విలువైన ఐదేళ్ళ సమయం వుంది. శత్రుదుర్భేద్యమైన తన కంచుకోటగా పిఠాపురంని బలమైన పునాదులతో నిర్మించుకోవడానికి ఈ సమయం సరిపోతుంది.