జనసేన అధినేత పవన్ కల్యాణ్.. రాయలసీమ పర్యటనలో చేస్తున్న సంచలన ప్రకటనల్లో మరొకటి చేరింది. తాను బీజేపీతో ఎప్పుడూ దూరంగా లేనని… కలిసే ఉన్నానని.. నిర్మోహమాటంగా ప్రకటించారు. ప్రత్యేకహోదా విషయంలో సైద్ధాంతికంగా విబేధించాను తప్ప… బీజేపీతో దూరంగా లేనని స్పష్టం చేశారు. వైసీపీ నాయకులకు అమిత్ షా అంటే భయమని.. తనకు మాత్రం గౌరవం అని పవన్ కల్యాణ్ తెలిపారు. తాను.. బీజేపీ, టీడీపీతో కలిసి గత ఎన్నికల్లో పోటీ చేయనందుకు .. వైసీపీ నేతలు తనకు రెండు చేతులు ఎత్తి దండం పెట్టాలన్నారు. తాను వారితో కలిసి పోటీ చేసి ఉంటే.. వైసీపీ ఎక్కడ ఉండేదని.. పవన్ ప్రశ్నించారు.
పవన్ కల్యాణ్ కి బీజేపీకి మధ్య బంధం బలపడుతోందని.. కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది. గత నెలలో హఠాత్తుగా ఢిల్లీ వెళ్లిన పవన్ కల్యాణ్.. రెండు రోజుల పాటు.. అక్కడ ఉండి తిరిగి వచ్చారు. ఆయన కీలకమైన సమావేశాల్లో పాల్గొన్నట్లుగా ప్రచారం జరిగింది కానీ.. ఎవరితో సమావేశం అయ్యారో మాత్రం బయటకు రాలేదు. ఆ తర్వాత నుంచే.. పవన్ కల్యాణ్… బీజేపీ విషయంలో.. మరింత సానుకూలత ప్రదర్శిస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. ఎన్నికల సమయంలో.. బీజేపీతో కలిసేందుకు పవన్ కల్యాణ్ ఏ మాత్రం అంగీకరించలేదు. ఏపీకి అన్యాయం చేసిన ఆ పార్టీతో ఎవరు కలుస్తారని ప్రశ్నించారు. అంతే కాదు.. తన పార్టీని బీజేపీలో విలీనం చేయమని సందేశాలు కూడా పంపారని.. కానీ తాను పాతికేళ్ల రాజకీయం కోసం.. పార్టీ పెట్టాను కానీ.. కలిపేయడానికి కాదని చెప్పానని పవన్ ప్రకటించారు కూడా.
పవన్ కల్యాణ్‌తో కలిసి పని చేస్తామంటూ.. ఏపీ బీజేపీ నేతుల కూడా కొద్ది రోజులుగా చెబుతున్నారు. ఈ క్రమంలో.. వైసీపీ నేతలు కూడా.. పవన్ కల్యాణ్.. అమిత్ షా, నరేంద్ర మోడీని పొగడటంతో… తమదైన ఎటాక్ ప్రారంభించారు. ఇక జనసేనను బీజేపీలో కలుపుతారా.. అని ప్రశ్నించడం ప్రారంభించారు. దీనికి కౌంటర్ గా.. తాను బీజేపీకి ఎప్పుడూ దూరంగా లేనని చెప్పుకునేందుకు.. పవన్ కల్యాణ్ ప్రయత్నించినట్లుగా తెలుస్తోంది. నిజానికి మోడీ పట్ల పవన్ కల్యాణ్.. ఎప్పుడూ సానుకూలంగా ఉన్నారు. హోదా విషయంలో మాత్రమే విబేధించారు. ఎన్నికల సమయంలో… పవన్ కు రామ్‌మాధవ్.. సహకరించారన్న గుసగుసలు కూడా వినిపించాయి. ఇప్పుడు.. పవన్ ప్రకటనతో.. ఏపీ రాజకీయాల్లో కొత్త మార్పులు రావడం ఖాయంగా కనిపిస్తోంది.