దాసోజు శ్రవణ్ అనే నేత బీజేపీకి రాజీనామా చేశారు. టీఆర్ఎస్లో చేరారు. అయితే చాలా మంది మొన్నే కదా బీజేపీలో చేరింది అప్పుడే జంపింగా అని ఆశ్చర్యపోయారు. కానీ జనసేన అధినేత పవన్ కల్యాణ్ మాత్రం ఆయనను అభినందిస్తూ ట్వీట్ చేశారు. ఇది బీజేపీ నేతలను షాక్‌కు గురి చేసింది. బీజేపీకి రాజీనామా చేసి టీఆర్ఎస్లో చేరితే పవన్ కల్యాణ్ అభినందించడంతో .. ఆయన రాజీనామా చేశారన్న బాధ కన్నా పవన్ తమను ఎగతాళి చేశారన్న భావన వారికి ఇబ్బందికరంగా మారింది.
బీజేపీ నేతలు పవన్ స్పందనను ఆశ్చర్యంగా చూస్తున్నారు. తెలంగాణ బీజేపీ నేతలు గతంలో పవన్ కల్యాణ్‌ను అవమానించారు. గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీ కోసం పోటీ నుంచి విరమించుకున్నా… తర్వాత అవమానించారని జనసేన వర్గాలు అసంతృప్తితో ఉన్నాయి. అదే సమయంలో ఏపీలో రాజకీయాలు కూడా మారిపోతున్నాయి. భారతీయ జనతా పార్టీ సహకారంపై అసంతృప్తితో ఉన్న ఆయన… తెలుగుదేశం పార్టీతో జత కట్టేందుకు ప్రయత్నిస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో పవన్ కల్యాణ్ స్పందన పై రకరకాల చర్చలు జరుగుతున్నాయి.
అయితే ఇందులో బీజేపీ కోణం ఏమీ లేదని.. పవన్ కల్యాణ్ కేవలం.. తన స్నేహితుడికి శుభాకాంక్షలు మాత్రమే చెప్పారని జనసేన వర్గాలు చెబుతున్నాయి. దాసోజు శ్రవణ్ మొదట పీఆర్పీ నేత. అప్పట్లో పవన్ తో సన్నిహితంగా ఉండేవారు. ఆయనంటే.. ఆయన రాజకీయ భావాలంటే పవన్ కల్యాణ్‌కు ఎంతో ఇష్టం. ఆ విషయాన్ని పలుమార్లు చెప్పారు. దాసోజు శ్రవణ్ లాంటి రాజకీయ నాయకుడికి సామాజికవర్గం పేరుతో రాజకీయ పార్టీలు అవకాశాలు కల్పించడం లేదని చాలా సార్లు ఆవేదన వ్యక్తం చేశారు కూడా. ఇప్పుడు అదే కోణంలో అభినందించారని అంటున్నారు. మొత్తానికి పవన్ ట్విస్ట్ మత్రం బీజేపీ నేతలకు షాకిచ్చింది.