చూస్తుండగానే పెద్ద హీరోయిన్ల జాబితాలో చేరిపోయింది పాయల్ రాజ్‌పుత్. తన కాల్షీట్లు అస్సలు ఖాళీలేవు. పారితోషికం కూడా సినిమా సినిమాకి పెరుగుతోంది. ఇలాంటి సమయంలో… ఎవరైనా సరే, కాస్త `లెవిల్` చూపించడం మొదలెడతారు. ఎలాగూ చేతినిండా అవకాశాలు ఉన్నాయి కాబట్టి, చిన్న దర్శకుల్ని, చిన్న నిర్మాతల్నీ అస్సలు పట్టించుకోరు. కానీ పాయల్ మాత్రం అలా కాదు. ఎవరు ఎలాంటి కథ చెప్పినా, ఓపిగ్గా వింటోందట. చిన్న సినిమా అయినా సరే, పాత్ర నచ్చితే… చేయడానికి రెడీ అయిపోతోందట. `ఏ పుట్టలో ఏ పాముందో ఎవరికి తెలుసు. ఆర్.ఎక్స్ 100 కూడా చిన్న సినిమానే కదా..` అంటోందట. అంతే కాదు… షాపింగ్ మాల్ ఓపెనింగ్స్ విషయంఓ పాయల్ కి ఉన్న డిమాండ్ అంతా ఇంతా కాదు. ఇలాంటి సమయంలో పాయల్ ఎంత అడిగితే అంత ఇవ్వడానికి రెడీ అయిపోతున్నారు. కానీ… ఎవరు ఎంత ఇస్తే, అంత తీసుకుని షాపింగ్ మాల్ ఓపెనింగ్స్‌కి హాజరైపోతోంది. ఒకట్రెండు సినిమాలు చేసిన వాళ్లే 5 నుంచి 8 లక్షలు డిమాండ్ చేస్తున్న ఈ తరుణంలో పాయల్ 3 లక్షలకే ఒప్పేసుకుంటుందట. ఇలా షాపింగ్ మాల్స్ వల్ల వచ్చిన డబ్బులతోనే ముంబైలో ఓ ఫ్లాటు కూడా కొనుక్కుందట. ఏ కథానాయిక అయినా క్రేజ్ కొన్నాళ్లే. అది ఉన్నప్పుడే `లెవిల్` చూపించకుండా… కొన్ని డబ్బులు వెనకేసుకోవడం తెలివైన లక్షణం. ఆ విషయంలో పాయల్ బాగానే ఆలోచిస్తోందనుకోవాలి.