ఆర్.ఎక్స్ 100తో ఇద్దరి జీవితాలు సెటిల్ అయిపోయాయి. ఒకటి కథానాయికగా పాయల్ రాజ్ పుత్ది.. హీరోగా… కార్తికేయది. అంత పెద్ద హిట్టు కొట్టినా.. దర్శకుడు అజయ్ భూపతి మాత్రం తదుపరి సినిమా కోసం రెండేళ్లు ఆగాల్సివచ్చింది. ఎట్టకేలకు `మహాసముద్రం` ని పట్టాలెక్కించాడు. శర్వానంద్ ,సిద్దార్థ్ హీరోలుగా నటిస్తున్నారు. అతిథిరావు హైదరీ, అను ఇమ్మానియేల్ లను కథానాయికలుగా ఎంచుకున్నారు. ఇప్పుడు.. పాయల్ రాజ్ పుత్ ని కూడా తీసుకున్నారని సమాచారం.
`ఆర్.ఎక్స్ 100` సెంటిమెంట్ ని కొనసాగిస్తూ.. పాయల్ కి ఓ పాత్ర ఇవ్వాలని అజయ్ ముందు నుంచీ అనుకుంటూనే ఉన్నాడు. నిజానికి కథానాయికగా.. పాయల్ నే ఎంచుకోవాలి. కానీ.. పాయల్ ఫామ్ లో లేదు. తన సినిమాలన్నీ ఫ్లాప్ అవుతున్నాయి. అందుకే అజయ్ అంత రిస్క్ తీసుకోలేదు. అయితే.. ఐటెమ్ గీతం కోసం పాత్రం పాయల్ ని ఖాయం చేసినట్టు సమాచారం. విశాఖ తీరం నేపథ్యంలో సాగే సినిమా ఇది. షూటింగ్ అంతా అక్కడే జరగనుంది. ఏకే ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి చేతన్ భరద్వాజ్ సంగీతం అందిస్తున్నాడు.