ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రూ. పాతిక వేల కోట్ల అప్పునకు గ్యారంటీ ఇచ్చి.. ఇవ్వలేని బుకాయిస్తున్నారని ఆరోపిస్తూ… దానికి సంబంధించిన పత్రాలను పయ్యావుల కేశవ్ బయట పెట్టడం సంచలనం సృష్టిస్తోంది. ఇటీవల ఏపీ సర్కార్ ఏపీ స్టేట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అనే ఓ కార్పొరేషన్‌ను ఏర్పాటు చేసింది. ఈ కార్పొరేషన్ పేరుతో రూ. పాతిక వేల కోట్ల రుణాన్ని బ్యాంకుల వద్ద నుంచి తీసుకుంది. అయితే ఈ రుణం వివరాలను శాసనసభకు సమర్పించలేదు. అలాగే.. పబ్లిక్ అకౌంట్స్ కమిటీ అడిగినా ఇవ్వలేదు. పైగా.. ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి… ప్రభుత్వం తరపున అప్పుల కోసం ఎలాంటి హామీలు ఇవ్వలేదని అందుకే శాసనసభకు చెప్పలేదని వాదించారు.
కానీ పయ్యావుల ఈ రోజు బ్యాంకులతో ఏపీ సర్కార్ చేసుకున్న ఒప్పందాన్ని బయట పెట్టారు. అందులో ఏపీ సర్కార్ రూ. పాతిక వేల కోట్లకు గ్యారంటీ ఇచ్చిందని.. మద్యం డిపోలను తాకట్టు పెట్టారని.. ఉందని వెల్లడించారు. అంతే కాదని.. పాతికేళ్ల పాటు మద్యంపై వచ్చే ఆదాయాన్ని నేరుగా ఎస్క్రో ఖాతాకు మళ్లిస్తున్నారని వెల్లడించారు. ఆ పత్రాల్లో … ఏపీ సర్కార్‌తో జరిగిన రుణ ఒప్పందాన్ని బ్యాంకులు రహస్యంగా ఉంచాలన్న షరతు ఏపీ ప్రభుత్వం పెట్టింది. దీన్ని పయ్యావుల ప్రశ్నించారు. ఈ అప్పు గురించి ఎవరి దగ్గర రహస్యంగా ఉంచాలనుకుంటున్నారని ప్రశ్నించారు. ప్రజలు దగ్గరా… అసెంబ్లీ దగ్గరా.. కేంద్రం దగ్గరా చెప్పాలని డిమాండ్ చేశారు.
పయ్యావుల వెల్లడించిన విషయాలు ఇప్పుడు సంచలనాత్మకం అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. రుణానికి గ్యారంటీ ఇచ్చి ప్రభుత్వం దాచి పెట్టడం ఓ తప్పయితే.. ఎఫ్ఆర్బీఎం చట్టాన్ని ఉల్లంఘించి మరీ రుణం తెచ్చుకోవడం.. మరో తప్పిదం. ఈ వివరాలు కేంద్రానికి తెలిస్తే.. ఏపీ సర్కార్ ఇంకెక్కడా రూపాయి కూడా రుణం తీసుకోనివ్వదు. అలాగే.. ప్రజల పన్నులను నేరుగా కన్సాలిడేటెడ్ ఫండ్‌కు కాకుండా.. ఎస్క్రో ఖాతాకు మళ్లించడం… అక్కడ్నుంచే బ్యాంకులకు చెల్లించడం.. రాజ్యాంగ ఉల్లంఘనగా చెబుతున్నారు. ఈ అంశఆలపై ఏపీ సర్కార్ వివరణ ఇవ్వాల్సి ఉంది.