అనుకున్నట్టుగానే రాత్రికి రాత్రే ప్రజావేదికను కూల్చేసింది రాష్ట్ర సర్కారు. ఇది నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన భవనమనీ, అక్రమ కట్టడాల తొలగింపు ఇక్కడి నుంచీ ప్రారంభం అవుతుందంటూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చెప్పడం, ఆయన ఆదేశాలకు అనుగుణంగా కూల్చేయడం కూడా జరిగిపోయింది. అయితే, ఇది ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు వినియోగించుకునే అవకాశం ఉంది అనే ఒకేఒక్క సాకుతోనే ఈ భవనాన్ని కూల్చేశారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. అక్రమ కట్టడాలు తొలగించాలంటే… విజయవాడలో వేల సంఖ్యలో అలాంటివి ఉన్నాయనీ, వాటినీ ఇదే తరహాలో తొలగించగలరా అంటూ సవాల్ చేస్తున్నారు పయ్యావుల కేశవ్.
ప్రతిపక్ష నేతకు అనుకూలంగా ఉందనీ, ఆయన అవసరాలకు వాడుకునే అవకాశం ఉందనే ఒకే ఒక్క ఉద్దేశంతోనే ప్రజావేదికను కూల్చేశారన్నారు. అంతేతప్ప, ఇదేమీ అక్రమ నిర్మాణం కాదన్నారు. అక్రమ కట్టడాలు అనే మాటకొస్తే… విజయవాడలో ఇవాళ్ల వేల సంఖ్యలో ఉన్నాయన్నారు. ఎందుకంటే, నగరంలో ఎటు చూసినా కాలువు ఉన్నాయి కాబట్టి అన్నారు. ఎటుచూసినా నదీ పరీవాహక ప్రాంతమే అవుతుందన్నారు. రివర్ ప్రొటెక్షన్ జోన్ పేరుతో తొలగింపులు అంటూ మొదలుపెడితే, రేప్పొద్దున్న అన్నింటినీ ప్రజా వేదిక తరహాలోనే నేలమట్టం చేస్తారా అంటూ ప్రభుత్వాన్ని పయ్యావుల కేశవ్ ప్రశ్నించారు. అన్నింటినీ ఇదే తరహాలో రాత్రికి రాత్రే ఆదేశాలిచ్చి తొలగించగలరా అంటూ నిలదీశారు.
అక్రమ కట్టడమైతే దాన్ని తొలగించడాన్ని ఎవ్వరూ సమర్థించరు. అయితే, విజయవాడలో ప్రజావేదికతోపాటు ఆ పక్కనే చాలామంది ప్రముఖల ప్రైవేటు భవనాలున్నాయి. వాటికీ ఇప్పుడు నోటీసులు ఇస్తారా అనేది చూడాలి. ఇంకోటి, గతంలో ప్రతిపక్షంలో ఉండగానే వైకాపా నేతలు చంద్రబాబు నివాసంపై మాత్రమే చాలా విమర్శలు చేశారు. అయితే, విజయవాడలో ఇన్ని అక్రమ నిర్మాణాలున్నాయనీ, నదీ పరివాహక ప్రాంతంలో వందల సంఖ్యలో భవనాలను కూల్చేయాలనిగానీ ప్రతిపక్షంలో ఉండగా వైకాపా నేతలు మాట్లాడలేదు. అంతెందుకు, విజయవాడ ప్రాంతంలోని వైకాపా ఎమ్మెల్యేలు కూడా గతంలో ఈ అక్రమ నిర్మాణాలపై దీక్షలు పోరాటాల్లాంటివి చెయ్యలేదు. కానీ, ఇప్పుడు చర్యలకు దిగుతామంటున్నారు. ఎప్పుడైనా చర్యలు సమర్థనీయమే. కాకపోతే, ఇది కేవలం చంద్రబాబుకు సంబంధించిన భవనాలకు మాత్రమే పరిమితం కాకుండా, రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లోనూ ఇదే తరహా చర్యలుంటే హర్షనీయం. పార్టీలకు అతీతంగా ఈ చర్యల్ని కొనసాగిస్తే మంచిదే. కానీ, ఎక్కడైనా ఏమాత్రం జాప్యం జరిగినా… ప్రతిపక్ష పార్టీకి తొలి పోరాట అస్త్రాన్ని వైకాపా ఇచ్చినట్టు అవుతుంది.