తెలుగుదేశంలో కాస్త కామన్ సెన్స్‌తో మాట్లాడే నాయకులు ఎవరైనా ఉన్నారంటే.. పయ్యావుల కేశవ్ పేరు వినిపిస్తుంది. ఆయన వాగ్ధాటి అలాంటిది. అయితే, ప్రస్తుతం ఏపీ మంత్రి వర్గ విస్తరణకు రంగం సిద్ధమౌతోంది. ఈ నేపథ్యంలో పయ్యావులకు బెర్త్ కన్ఫర్మ్ అన్నట్టు కథనాలు వస్తున్నాయి. కానీ, పయ్యావుల వర్గంలో మాత్రం కాస్త టెన్షన్ ఉందట! దానికి కారణమేంటంటే.. పయ్యావులకు పదవి దక్కాలంటే కొన్ని అడ్డంకులను అధిగమించాల్సి ఉంటుందని అనుకుంటున్నారట!
మొదటి అడ్డంకి ఏంటంటే.. పయ్యావుల వర్గానికీ పరిటాల సునీత వర్గానికీ మధ్య ఉన్న విభేదాలు! గత ఎన్నికల్లో పయ్యావుల కేశవ్ ఓడిపోయిన సంగతి తెలిసిందే. అయితే, ఇదే తరుణంలో తన కుటుంబానికి బద్ధ శత్రువులుగా ఉంటున్న జేసీ సోదరులను టీడీపీలోకి పయ్యావులే తీసుకొచ్చారన్నది పరిటాల వర్గం ఆగ్రహం! ఇది బయటకి వ్యక్తం కాకపోయినా, లోలోప సునీత వర్గానికి పయ్యావులపై కాస్త గుర్రుగా ఉందని సమాచారం. దీంతో పయ్యావుల మంత్రి పదవికి పరిటాల వర్గం అడ్డుపడే అవకాశాలున్నాయని భావిస్తున్నారు. పయ్యావుల ఓటమికి కారణం కూడా ఈ వర్గం చేసిన ప్రయత్నాలే అనేది ప్రచారం ఎప్పట్నుంచో ఉంది. సో… దీంతో ఈ ప్రభావం తన పదవిపై పడకుండా ఉండేందుకు పయ్యావుల కూడా తనవంతు ప్రయత్నాలు తీవ్రతరం చేశారనే చెబుతున్నారు.
రెండో అడ్డంకి ఏంటంటే… సెంటిమెంట్! అవును, అసలే తెలుగుదేశం పార్టీలో ఇవి ఎక్కువ. పయ్యావుల గెలిస్తే పార్టీ ఓడిపోతుంది… ఆయన ఓడితే పార్టీ అధికారంలోకి వస్తుందన్న సెంటిమెంట్ ఒకటుందట! ఈసారి పయ్యావుల ఎమ్మెల్యేగా ఓడిపోయారు. టీడీపీ అధికారంలోకి వచ్చింది. గుడ్డిలో మెల్ల అన్నట్టుగా ఆయన్ని ఎమ్మెల్సీ చేశారు. ఓ దశలో పయ్యావులను పార్టీ అధ్యక్షుడు చేయాలని అనుకున్నారట. అయితే, పయ్యావుల వాక్చాతుర్యం, ఆయన రాజకీయ చతురత చంద్రబాబుకు తెలియనివి కావు. మరీ ఇంత తెలివైన నాయకుడిని పార్టీ అధ్యక్షుడిగా పెట్టుకుంటే… ఆయన చకచకా పార్టీలో రెండో అధికార కేంద్రంగా ఎదిగిపోతే..? ఇలాంటి విజన్ చంద్రబాబుకు బాగా ఉంటుందని అంటారు! అందుకే, నోట్లో నాలుకలేని కళావెంకట్రావుకు పార్టీ బాధ్యతలు కట్టబెట్టారనే టాక్ కూడా ఉంది.
ఏదైతేనేం, పరిటాల వర్గం నుంచి వ్యతిరేకతను పయ్యావుల తట్టుకోవాల్సి ఉంటుంది. అలాగే, చంద్రబాబు దృష్టిలో పయ్యావులకు మంత్రి పదవి ఇవ్వొచ్చనే ఇమేజ్ సాధించుకోవాలి. ఈ రెండూ దాటుకుంటే పయ్యావులకు పదవి గ్యారంటీ అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.