శుక్రవారం నుంచి ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావాలని వైసీపీ అధినేత జగన్ ను కోరారు ఏపీ మంత్రి పయ్యావుల కేశవ్. జగన్ సభకు వచ్చి సమస్యలపై మాట్లాడాలనే తాము కోరుకుంటున్నట్లు తెలిపారు.
రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమం కోసం సలహాలు, సూచనలు ఆశిస్తున్నామని… సభలో అర్ధవంతమైన చర్చలు కొనసాగాలని కోరుకుంటున్నట్లు స్పష్టం చేశారు. శాసన సభా వ్యవహారాల మంత్రిగా బాధ్యతలు చేపట్టిన పయ్యావుల.. అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై తొలి సంతకం చేశారు. అనంతరం మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు. చంద్రబాబు నేతృత్వంలో ప్రజలకు జవాబుదారీతనంతో కూడిన పాలన అందిస్తామన్నారు.
ప్రజా సమస్యలపై అసెంబ్లీలో చర్చిస్తామని… ప్రజస్వామ్యయుతంగా అసెంబ్లీ సమావేశాలను నిర్వహిస్తామని స్పష్టం చేశారు. రాష్ట్ర అభివృద్ధి విషయంలో భేషజాలకు పోమన్న పయ్యావుల..వైసీపీ నుంచి వచ్చే సలహాలను స్వీకరిస్తామన్నారు. జగన్ అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావాలని, సమస్యలపై సభలో మాట్లాడాలని సూచించారు. అయితే, శుక్రవారం నుంచి అసెంబ్లీ సమావేశాలు ఉండటంతోనే నేటి పులివెందుల పర్యటనను జగన్ వాయిదా వేసుకున్నట్లు తెలుస్తోంది.