తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆంధ్రా పర్యటనకు వచ్చి రాజేసిన రాజకీయ చిచ్చు తెలుగుదేశం పార్టీలో ఇంకా చల్లారలేదు. అనంతపురంలో జరిగిన పరిటాల శ్రీరామ్ పెళ్లికి కేసీఆర్ రావడం, టీడీపీ నేత పయ్యావుల కేశవ్ ను పక్కకు పిలవడం, రహస్యంగా కాసేపు మాట్లాడటం.. ఈ పరిణామాలపై టీ టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి కొంత ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. చిరకాల మిత్రుడైన పయ్యావులపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమక్షంలోనే అసంతృప్తి వేశారు. పయ్యావులకు తెలంగాణ రాజకీయాలపై ఆసక్తి ఉంటే, ఇక్కడికి వచ్చి తెరాసలో చేరొచ్చని కూడా అనేశారు. ఈ మొత్తం పరిణామాలపై తాజాగా పయ్యావుల కేశవ్ పార్టీ నేతల ముందు మాట్లాడినట్టు సమాచారం. కేసీఆర్ పర్యటన సందర్భంగా తన వైఖరిని తప్పుబట్టడమేంటని ఆయన కూడా అసంతృప్తి వ్యక్తం చేశారట.
కేసీఆర్ అనంతపురానికి వచ్చినప్పుడు ఇతర టీడీపీ నేతలతో కూడా సఖ్యంగా ఉన్నారనీ, తాను కూడా అలానే వ్యవహరించాను అని పయ్యావుల చెప్పారట. పరిటాల ఇంట పెళ్లికి తానూ ఒక అతిథిగానే వచ్చాననీ, కేసీఆర్ ఎదురుగా కనిపించగానే మర్యాదపూర్వకంగా అభివాదం చేశానని అన్నారు. ఆ తరువాత, తనదారిన తాను వెళ్లిపోతుంటే ఓ పోలీసు అధికారితో కేసీఆర్ కబురు పెట్టారనీ, ముఖ్యమంత్రి స్థాయి నాయకుడు పిలుస్తుంటే వెళ్లకపోతే బాగోదని తిరిగి వెళ్లాను అని చెప్పారు. ఇందుతో తన తప్పు ఏముందని పయ్యావుల వివరణ ఇచ్చుకునే ప్రయత్నం చేసినట్టు సమాచారం. రెండు నిమిషాలు మాట్లాడిన దానికి ఇంత తీవ్రంగా స్పందించాలా, తెలంగాణలో పార్టీ నాయకులు రాజీనామాలు చేస్తారు అనేలా మాట్లాడాలా అంటూ పయ్యావుల అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ ఘటనపై ముఖ్యమంత్రికి సరైన సమాచారం అందకపోవడం వల్లనే తనను తప్పుబట్టే పరిస్థితి వచ్చిందని కూడా ఆయన చెప్పారు. ‘కేసీర్ తో భేటీ ఎందుకూ, సీనియర్ నేతలే ఇలా చేస్తే ఎలా..? తెలంగాణలో మన పార్టీ ఏమౌతుందీ’ అంటూ కొందరు వ్యాఖ్యానించడం సరికాదని కూడా పయ్యావు నేతల ముందు వ్యాఖ్యానించారట.
పయ్యావుల కేశవ్ తనకు తానుగా కేసీఆర్ తో రహస్య మంతనాలు జరపలేదు. కానీ, ఈ ఘటన తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయంగా మారింది. టీడీపీ, తెరాసల మధ్య పొత్తు ఉంటుందనే స్థాయిలో కథనాలు వచ్చేశాయి. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి స్పందించి… పయ్యావులపై కొన్ని వ్యాఖ్యలు చేశారు. గడచిన వారం రోజులుగా ఇదే చర్చ వాడీవేడీగా జరుగుతోంది. మీడియాలో కూడా రకరకాల కథనాలు వస్తున్నాయి. కానీ, ఇంతవరకూ పయ్యావుల స్పందించలేదు. ఇప్పుడు కూడా ఇప్పుడు పయ్యావుల వివరణ ఎలా ఉందంటే.. రేవంత్ రెడ్డికి ఇచ్చిన సమాధానంగా అనిపిస్తోంది. ఇదే వివరణ ఓ నాలుగైదు రోజులు కిందటే ఇచ్చి ఉంటే.. తెలంగాణలో ఈ భేటీపై చర్చ ఉండేది కాదు. రేవంత్ కూడా అంత ఆవేదన చెందేవారు కాదు. ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా తనను తప్పుపట్టే విధంగా మాట్లాడేవారు కాదు కదా.