వచ్చే ఏడాది పాకిస్థాన్ వేదికగా జరిగే ఛాంపియన్స్ ట్రోఫీ పై అనిశ్చితి వీడింది. దాయాది దేశంలో పర్యటించేది లేదని బీసీసీఐ చాలాసార్లు తేల్చి చెప్పింది. తమ దేశంలోనే టోర్నీ మొత్తం జరగాలని పీసీబీ పట్టుబట్టింది. టోర్నీని హైబ్రిడ్ మోడల్లో నిర్వహించేందుకు తాము అంగీకరించమని పంతం పట్టింది. పాక్ తన మొండి వైఖరిని అలాగే కొనసాగించి.. ఛాంపియన్స్ ట్రోఫీని బహిష్కరిస్తే మాత్రం తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని పలువురు పీసీబీని హెచ్చరించారు.
మరోవైపు తాము ఆడే మ్యాచ్లను తటస్థ వేదికలకు మార్చి హైబ్రిడ్ మోడల్లో టోర్నీని నిర్వహించాలని బీసీసీఐ, ఐసీసీని ఎప్పటికప్పుడు కోరుతూ వచ్చింది. ఇప్పుడు భారత్ కోరినట్లుగా హైబ్రిడ్ మోడల్లోనే టోర్నీ జరగనుంది. ఈ విషయాన్ని ఐసీసీ అధికారికంగా ప్రకటించింది.
2024-27 మధ్య ఐసీసీ ఈవెంట్లలో టీమ్ఇండియా, పాకిస్థాన్ మ్యాచ్లు తటస్థ వేదికలోనే నిర్వహిస్తారు. 2025 మహిళల క్రికెట్ ప్రపంచ కప్ (భారత్), 2026 టీ20 ప్రపంచ కప్ (భారత్, శ్రీలంక)లో జరగనున్నాయి. ఈ టోర్నీల కోసం పాకిస్థాన్ జట్టు భారత్లో పర్యటించదు. తటస్థ వేదికలో పాక్ మ్యాచ్లు నిర్వహిస్తారు.
నవంబర్ లోనే 2025 ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ రావాల్సింది. పాక్ పంతం కారణంగా ఆగింది. ఒకదశలో పాక్ ను ఆతిధ్యం నుంచి తప్పించే అవకాశం కూడా వుందని వార్తలు వచ్చాయి. అలా జరిగితే ఆర్ధికంగా పాక్ బోర్డ్ నష్టాలని చూడాల్సి వచ్చేది. మొత్తానికి పాక్ ఈగోని వీడి హైబ్రీడ్ మోడల్ కి అంగీకరించడంతో టోర్నీపై అనిశ్చితి వీడింది. త్వరలోనే షెడ్యూల్ ఖరారు చేయనుంది ఐసీసీ.