తెలంగాణ ప్రభుత్వంపై పోరాటానికి.. కాంగ్రెస్ పార్టీకి దొరికిన ఓ గొప్ప అవకాశం… ఇంటర్ బోర్డు పరీక్షల్లో అవకతవకలు. యువజన విభాగాలు.. దీన్ని అందిపుచ్చుకున్నాయి. పోరాడాయి. వారిని రేవంత్ రెడ్డి ప్రొత్సహించారు. కానీ.. అసలైన వ్యక్తి మాత్రం.. ఇలా పోరాడినందుకు… వార్నింగ్‌లు ఇస్తున్నారట. ఆయనే ఉత్తమ్ కుమార్ రెడ్డి, పీసీసీ చీఫ్. నిజానికి ఉత్తమ్ కుమార్ రెడ్డి గ్లోబరీనా పై పోరాటం పేరుతో దీక్ష చేయాలనుకున్నారు. అయితే సమస్య విద్యార్థులది కావడంతో పార్టీ అనుబంధ సంఘాలైన యూత్ కాంగ్రెస్, ఎన్ఎస్యూఐ అధ్యక్షులను తెర ముందుకు తెచ్చారు. గుర్తింపు కోసం.. ఏదో ఒకటి చేయాలన్న హుషారులో ఉన్న వారు… దీక్షకు సై అన్నారు. విద్యార్థి విభాగం అధ్యక్షుడు బలమూరు వెంకట్, యువజన విభాగం అధ్యక్షుడు అనిల్ కుమార్ యాదవ్ గాంధీభవన్ లోనే దీక్ష ప్రారంభించారు.
దీక్షకు అవసరమైన అన్ని ఏర్పాట్లను పీసీసీ వర్కింగ్ ప్రసిడెంట్ రేవంత్ రె్డ్డి చూసుకున్నారు. నాయకులు సైతం వచ్చి దీక్షకు సంఘీభావం తెలిపారు. కానీ పీసీసీ చీఫ్ మాత్రం కన్నెత్తి చూడలేదు. ఈ దీక్షకు కనీసం తన సంఘిభావాన్ని కూడా ప్రకటించలేదు. మద్దతు ప్రకటించక పోగా దీక్షకు దిగిన నాయకులకు స్వయంగా ఫోన్ చేసి తన అనుమతి లేకుండా దీక్షకు ఎలా దిగుతారని మందలించారట. దాంతో ఎంతో ఉత్సాహంగా దీక్షకు కూర్చున్న నాయకులు ఉత్తమ్ వైఖరితో ఖిన్నులయ్యారు. తాము సమాచారం ఇచ్చేందుకు ఫోన్ చేస్తే కనీసం స్పందించకుండా ఇప్పడు తమను తప్పుబట్టడాన్ని వారు జీర్ణీంచుకోలేకపోతున్నారు. పీసీసీ చీఫ్ సహాయ నిరాకరణ పార్టీ వర్గాల్లో చర్చనీయాంశం అయ్యింది. ప్రభుత్వంపై వీరోచితంగా పోరాటం చేయాల్సిన అధ్యక్షుడే… అడ్డం పడటం.. కలకలం రేపుతోంది.
పీసీసీ అధ్యక్షుని తీరు.. కొంత కాలం నుంచి.. టీఆర్ఎస్ కు పాజిటివ్‌గా ఉందన్న ప్రచారం జరుగుతోంది. ఎన్నికల ఫలితాల తర్వాత ఆయన పూర్తిగా సైలెంటయ్యారు. ఏ విషయంలోనూ… టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని తప్పు పట్టే ప్రయత్నం చేయలేదంటున్నారు. పైగా.. నల్లగొండ నుంచి పోటీ విషయంలోనూ… రాహుల్ గాంధీ ఒత్తిడి చేస్తేనే ఒప్పుకున్నారు. నిజానికి హైకమాండ్ కూడా… ఉత్తమ్ విషయంలో.. ఆలోచిస్తోందని… ఆయన తీరు తేడాగా ఉండబట్టే.. లోక్‌సభ బరిలోకి దింపారని అంటున్నారు. ఉత్తమ్ వ్యవహారశైలి… చూస్తే… కాంగ్రెస్ హైకమాండ్… లోక్‌సభ ఎన్నికల ఫలితాల తర్వాత కీలక నిర్ణయం తీసుకునే సూచనలు కనిపిస్తున్నాయంటున్నారు.