కాంగ్రెస్ పార్టీని జగన్మోహన్ రెడ్డి విడిచిపెట్టినా అది మాత్రం ఆయనని విడిచిపెట్టడం లేదు. జగన్మోహన్ రెడ్డి తన కొడుకువంటి వాడని చెప్పిన కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారల ఇన్-చార్జ్ దిగ్విజయ్ సింగ్, జగన్ దీక్షకు మద్దతు తెలిపి వైకాపాతో కలిసి ప్రత్యేక హోదా కోసం పోరాడేందుకు తమ పార్టీ సిద్దంగా ఉందని విస్పష్టంగా చెప్పారు. ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్షుడు రఘువీరా రెడ్డి కూడా ఇప్పుడు అదే పాట పాడుతున్నారు.
ప్రత్యేక హోదా గురించి వైకాపాతో కలిసి పోరాటాలు చేయడానికి తమకి ఎటువంటి అభ్యంతరాలు, బేషజాలు లేవని అన్నారు. అయితే ప్రత్యేక హోదా ఇస్తానని మాట తప్పిన ప్రధాని నరేంద్ర మోడీని జగన్మోహన్ రెడ్డి నిలదీసి ప్రశ్నించనంతవరకు ఆయన చేస్తున్న పోరాటాలకు విశ్వసనీయత ఏర్పడదని అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో అన్ని ప్రతిపక్ష పార్టీలు కలిసి ప్రత్యేక హోదా కోసం పోరాడాలని ప్రజలు కోరుకొంటున్నారు కనుక కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డితో కలిసి పోరాడేందుకు సిద్దంగా ఉందని ప్రకటించారు.
ఈ సందర్భంగా ఆయన మరొక ఆసక్తికరమయిన విషయం కూడా బయటపెట్టారు. బహుశః జగన్మోహన్ రెడ్డిని ప్రసన్నం చేసుకొని ఆయనతో చేతులు కలిపేందుకే అయ్యుండవచ్చును. రాజశేఖర్ రెడ్డి అకస్మాత్తుగా మరణించిన తరువాత జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేయాలని తనే అందరికంటే ముందుగా ప్రతిపాదించానని, కానీ పార్టీ అధిష్టానం రోశయ్యను ముఖ్యమంత్రిగా చేయడంతో తను ఆయన మంత్రివర్గంలో చేరడానికి అయిష్టత చూపానని తెలిపారు.
రఘువీరా రెడ్డి మాటలను బట్టి అర్ధమవుతుంది ఏమిటంటే కాంగ్రెస్ పార్టీ జగన్ నాయకత్వంలో పనిచేసేందుకు సిద్దంగా ఉంది. దానినే మరోవిధంగా చెప్పాలంటే జగన్ ఇష్టపడితే వైకాపాను కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసి జగన్ పీసీసీ అధ్యక్షుడుగా బాధ్యతలు చేపట్టవచ్చునని సూచిస్తున్నట్లుంది. ప్రధాని నరేంద్ర మోడీ తెదేపాతో తమ పొత్తులు కొనసాగుతాయని స్పష్టం చేసారు కనుక జగన్మోహన్ రెడ్డి ఈ ప్రతిపాదన గురించి ఆలోచించవచ్చును. కానీ ఆయన మళ్ళీ సోనియా, రాహుల్ గాంధీల ముందు చేతులు కట్టుకొని వినయంగా నిలబడవలసి ఉంటుంది. ఆయన తన బద్ధ శత్రువయిన రామోజీరావు ముందు చేతులు జోడించి నిలబడగలిగారు కనుక ఇదీ పెద్ద కష్టం కాదు. కనుక రఘువీరా రెడ్డి ఇస్తున్న ఈ బంపర్ ఆఫర్ గురించి జగన్మోహన్ రెడ్డి ఆలోచించడం మంచిదే.