లేకలేక వచ్చిన అవకాశం చేజారిపోతుందేమో అని కమలనాథులు ఆందోళన చెందుతున్నారు. జమ్ము కాశ్మీర్ ప్రభుత్వంలో భాగస్వాములు అవుతారని బీజేపీ వారు కలలో కూడా ఊహించి ఉండరు. మోడీ హవా, ఇతరత్రా కారణాల వల్ల 25 సీట్లను బీజేపీ గెలవడం, కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్ కూటమి బాగా వెనకబడటం వల్ల పీడీపీ సంకీర్ణ ప్రభుత్వంలో చోటు దక్కింది. ముఫ్తీ మహమ్మద్ సయీద్ మరణం తర్వాత సీన్ మారిపోయింది. ముఫ్తీ కుమార్తె మెహబూబా బీజేపీతో పొత్తుకు వ్యతిరేకంగా ఉన్నారని వార్తలు వస్తున్నాయి.
రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించి నెలదాటినా మెహబూబా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయలేదు. ఎటూ తేల్చడం లేదు. తన డిమాండ్లపై బీజేపీ అధినాయకత్వం హామీ ఇవ్వాలని మెహబూబా పట్టుపడుతున్నారు. తనకు పూర్తి స్వేచ్ఛ కావాలనేది ఆమె మొదటి డిమాండ్ గా తెలుస్తోంది. అంటే, తాను ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నా మిత్ర పక్షం అడగవద్దని ఆ డిమాండ్ ఉద్దేశం. ఆర్టికల్ 370కి వ్యతిరేకంగా బీజేపీ వారు మాట్లాడ వద్దనేది మరో డిమాండ్.
వేర్పాటు వాదుల పట్ల మెతక వైఖరి అవలంబించిన ముఫ్తీ వ్యవహార శైలి వల్ల ఇప్పటికే అనేక సార్లు బీజేపీ ఇబ్బంది పడింది. మెహబూబా మరింత దూకుడుగా వేర్పాటు వాదులకు అనుకూలంగా వ్యవహరిస్తారనే పేరుంది. కేంద్రం వేర్పాటు వాదులతోచర్చలు జరపాలనేది కూడా ఆమె డిమాండ్ అని తెలుస్తోంది. అసలు పాకిస్తాన్ తో చర్చలకే అతీ గతీ లేదు. ఓ వైపు ఉగ్రవాదాన్ని ఎగదోసే పాక తో చర్చలు వద్దని దేశంలో చాలా మంది అభిప్రాయ పడుతున్నారు. అలాంటప్పుడు వేర్పాటు వాదులతో మోడీ ప్రభుత్వం చర్చించాలనడం షాక్ కలిగించే విషయం. అందుకే దీనిపై ప్రధాని మోడీ స్పందించడం లేదని సమాచారం. మెహబూబా గొంతెమ్మ కొర్కెలు తీర్చడం సాధ్యం కాదని కమలనాథులు చెప్తున్నారు.
అవసరమైతే మధ్యంతర ఎన్నికలకు వెళ్తామంటూ బీజేపీపై ఒత్తిడి తేవడానికి మెహబూబా ప్రయత్నిస్తున్నారు. అదే జరిగితే తమ సీట్లు తగ్గవచ్చనే భయం కమలనాథుల్లో ఉంది. కానీ ఏమీ చేయలేని పరిస్థితి. పీడీపీ ఎమ్మెల్యేలు ఇప్పటికే టెన్షన్ లో ఉన్నారు. గెలిచిన ఏడాది లోపే మళ్లీ ఎన్నికలకు వెళ్లడమా అని బావురుమంటున్నారు. వీళ్లలో అత్యధికులు బయటకు వచ్చి వేరే గ్రూపుగా నిలవడమో, వేరే పార్టీలో కలవడమో జరిగితే ప్రత్యామ్నాయ ప్రభుత్వం ఏర్పాటు కావచ్చని ఊహాగానాలు వినవస్తున్నాయి. అదే జరిగితే మెహబూబా రాజకీయ జీవితంలో అది అతి పెద్ద చారిత్రక తప్పిదం అవుతుంది. అయినా సరే, బీజేపీతో పొత్తు వద్దనుకుంటే కాంగ్రెస్ తో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయవచ్చు. ఏడాదిలోగా మధ్యంతర ఎన్నికలకు వెళ్లడం అంటే ప్రజల తీర్పును అవమానించడమే. చివరకు మెహబూబా ఏ నిర్ణయం తీసుకుంటారో చూద్దాం.