హిజ్బుల్ ముజాహుద్దీన్ ఉగ్రవాది బుర్హాన్ వనీ ఎన్కౌంటర్ కి నిరసన తెలుపుతూ కాశ్మీర్ లో గత రెండు వారాలుగా ఆందోళనలు సాగుతున్నాయి. వాటిలో సుమారు 32మంది మరణించారు. వందల మంది పౌరులు గాయపడ్డారు. ఇప్పుడిప్పుడే కొంచెం ప్రశాంత పరిస్థితులు కనబడుతున్నప్పటికీ, ఇంకా ఆందోళనకారులు అక్కడక్కడ రెచ్చిపోయి భద్రతాదళాలపై దాడులు చేస్తూనే ఉన్నారు. ఇటువంటి ఘటనలు వేరే ఏ రాష్ట్రంలో జరిగినా వాటికి రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యమే కారణమని కేంద్రప్రభుత్వం నిందిస్తుంది. కానీ, కాశ్మీర్ లో ఘటనలకి కేంద్రప్రభుత్వ తప్పుడు నిర్ణయాలు, వైఫల్యమే కారణమని రాష్ట్ర ప్రభుత్వం నిందిస్తోంది. జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో భాజపా, పిడిపిలు కలిసి సంకీర్ణ ప్రభుత్వం నడుపుతున్నాయి. అటువంటప్పుడు అది కేంద్రాన్ని తప్పుపట్టడం ఇంకా అసహజంగా ఉంది.
లోక్ సభలో కాశ్మీర్ అల్లర్లపై జరుగుతున్న చర్చలో పిడిపి ఎంపి ముజఫర్ బేగ్ మాట్లాడుతూ, “అసలు బుర్హాన్ వనీని ఎన్కౌంటర్ చేయవలసిన అవసరం ఏమిటి? అందుకు కేంద్రప్రభుత్వం ఎందుకు ఈ సమయం ఎంచుకొంది? ఒకవేళ అతనిపై అనుమానాలుంటే ఎప్పుడో అరెస్ట్ చేసి ఉండవచ్చు కదా? అరెస్ట్ చేయకుండా ఏకంగా ఎన్కౌంటర్ చేయడాన్ని మీ ప్రభుత్వం ఏవిధంగా సమర్ధించుకొంటుంది..చెప్పండి? అని ప్రశ్నించారు.
తమ ప్రభుత్వమే అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రంలో శాంతి భద్రతలని కాపాడవలసిన బాధ్యత పి.డి.పి.పైనే ఉంటుంది. సరిహద్దు రాష్ట్రమైన కాశ్మీర్ పరిస్థితి కొంచెం భిన్నం అయినప్పటికీ, ఆ కారణంగా వేర్పాటువాదులు, ఉగ్రవాదులపట్ల రాష్ట్ర ప్రభుత్వమే మెతక వైఖరి అవలంభిస్తూ, కేంద్రాన్ని కూడా అదేవిధంగా ఉండమని కోరడం చాలా విస్మయం కలిగిస్తుంది. కేంద్రం, భద్రతాదళాలు పక్కకి తప్పుకొనేమాటయితే, రాష్ట్ర ప్రభుత్వమే స్వయంగా ఉగ్రవాదులు, వేర్పాటువాదులకి స్వాగతం పలుకుతుందేమో? పి.డి.పి. వేర్పాటువాదం గురించి తెలిసి ఉన్నప్పటికీ భాజపా దానితో పొత్తులు పెట్టుకొని, దానితో కలిసి ప్రభుత్వంలో భాగస్వామిగా కొనసాగుతున్నందునే, ముజఫర్ బేగ్ కేంద్రాన్ని తప్పు పట్టగలిగారని చెప్పవచ్చు.