జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో పిడిపి, బీజేపీలు కలిసి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేసాయి. కానీ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ముఫ్తీ మొహమ్మద్ సయీద్ ఆకస్మిక మృతి తరువాత ప్రభుత్వ ఏర్పాటుపై ఆ రెండు పార్టీల మధ్య ప్రతిష్టంభన కొనసాగుతోంది. ఆ రెండు పార్టీలు ఒక దానికొకటి విదిస్తున్న కొన్ని కొత్త షరతుల కారణంగానే వాటి మధ్య ప్రతిష్టంభన ఏర్పడినట్లు తెలుస్తోంది. వాటిలో బీజేపీ షరతులు కేవలం అధికారం పంచుకొనే విషయంలో మాత్రమే కాగా, పిడిపి మాత్రం పాకిస్తాన్ తో భారత్ అనుసరించవలసిన విధానంపై షరతు విధించినట్లు తెలుస్తోంది. అది ఆ పార్టీ నేతల మాటలలోనే స్పష్టం అవుతోంది.
“జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో ప్రజలు ప్రశాంతంగా జీవించేందుకు మోడీ ప్రభుత్వం పాకిస్తాన్ తో స్నేహ సబంధాలు మెరుగుపరుచుకొంటుందని ఆశిస్తున్నాము. ముఫ్తీ సాబ్ మరణశయ్య ఉన్నప్పుడు ప్రధాని నరేంద్ర మోడి లాహోర్ పర్యటించి, ప్రయత్నం చేయడం, సయీద్ సాబ్ ఆశిస్తున్న విధానమే. దానిని మోడీ ప్రభుత్వం కొనసాగించాలని కోరుకొంటున్నాము,” అని పిడిపి శాసనసభ్యుడు నయీం అక్తర్ మీడియాతో అన్నారు.
పిడిపి నేతలు జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర రాజకీయాల వరకు ఎటువంటి షరతులు విధించినా అవి ఆ రెండు పార్టీలకు సంబంధించిన రాజకీయ వ్యవహారంగా భావించవచ్చును. కానీ కేంద్రప్రభుత్వ విదేశీ విధానం ఏవిధంగా ఉండాలో పిడిపి వంటి ఒక ప్రాంతీయ పార్టీ నిర్దేశించడాన్ని బీజేపీ అంగీకరించవచ్చునేమో కానీ దేశ ప్రజలు ఎవరూ హర్షించలేరు. పైగా స్వయంగా ప్రభుత్వం ఏర్పాటు చేసుకోలేని పరిస్థితిలో బీజేపీ లేదా వేరే పార్టీ మద్దతు తీసుకొంటూ, మద్దతు తీసుకొనేందుకు ఈవిధమయిన షరతులు విదించడం, అందుకు బీజేపీ తలూపడం చాలా విచిత్రంగా ఉంది.
కేంద్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ ఇరుగుపొరుగు దేశాలతో సఖ్యతనే కోరుకొన్నాయి తప్ప యుద్ధం చేయాలని ఎన్నడూ ఆలోచించలేదు. కానీ పాకిస్తాన్ పదేపదే భారత్ ని కవ్విస్తూనే ఉంది. పాక్ ఉగ్రవాదులు జమ్మూ కాశ్మీర్ తో సహా భారత్ లో వివిధ రాష్ట్రాలలో దాడులకు పాల్పడుతూనే ఉన్నారు. ప్రధాని నరేంద్ర మోడి లాహోర్ వెళ్లి పాకిస్తాన్ కి స్నేహహస్తం అందించి వచ్చిన వెంటనే మళ్ళీ పఠాన్ కోట్ పై ఉగ్రవాదులు దాడికి తెగబడ్డారు. ఏడుగురు జవాన్లు మరణించారు. కానీ పిడిపి దానిని పెద్ద తప్పుగా భావించినట్లు లేదు. అందుకే ఏదో ముక్తసరిగా ఖండించి ఊరుకొంది.
పాక్ సార్వభౌమత్వాన్ని సవాలు చేస్తే భారత్ పై అణుబాంబుని ప్రయోగించదానికి కూడా వెనుకాడబోమని పాక్ సైన్యాధక్షుడు ఇదివరకు ఒకసారి ప్రకటించేరు. దానిని కూడా పిడిపి తప్పుగా భావించలేదు. కానీ పఠాన్ కోట్ పై దాడి జరిగిన తరువాత కూడా భారత్, పాకిస్తాన్ తో స్నేహంగా ఉండాలని, దానితో సంబంధాలు మెరుగుపరుచుకోవాలని గట్టిగా నొక్కి చెపుతోంది. బీజేపీ మద్దతు తీసుకొని దానితో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ఇదీ ఒక ప్రధానమయిన షరతు అని నొక్కి చెపుతోంది. అంటే పిడిపి విధానం ఏమిటో, అది ఎటువైపు ఉందో చాలా స్పష్టంగానే చాటి చెపుతున్నట్లుంది.
మరి పిడిపితో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయడం కోసమే మోడీ ప్రభుత్వం పఠాన్ కోట్ దాడి తరువాత కూడా పాక్ పట్ల ఇంత సంయమనంగా వ్యవహరిస్తోందా? లేక తన విదేశీ విధానంలో పరిణతి కారణంగానే సంయమనం ప్రదర్శిస్తోందా? అనే అనుమానం కలుగుతోంది. బీజేపీ-పిడిపిల పొత్తులు కుదిరినా లేకపోయినా భారత్-పాక్ దేశాల మధ్య బలమయిన స్నేహ సంబంధాలు నెలకొనాలనే ఇరు దేశాల ప్రజలు కోరుకొంటున్నారు. కానీ అందుకోసం భారత విదేశీ విధానాన్ని స్వయంగా ప్రభుత్వాన్ని కూడా ఏర్పాటు చేసుకోలేని పరిస్థితులో ఉన్న పిడిపి వంటి ఒక ప్రాంతీయ పార్టీ నిర్దేశించడాన్ని ఎవరూ జీర్ణించుకోలేరు. సమర్ధించబోరు కూడా.