కాశ్మీరులో ముఫ్తీ సంకీర్ణ ప్రభుత్వానికి భాజపా మద్దతు ఉపసంహరించడంతో ప్రభుత్వం కూలిపోయిన సంగతి తెలిసిందే. గత నెల 20 నుంచి అక్కడ గవర్నర్ పాలనే సాగుతోంది. జమ్మూ కాశ్మీరులో తాము ఆశించిన అభివృద్ధి జరగలేదనీ, అభివృద్ధి జరగని చోట ప్రభుత్వంలో కొనసాగే నైతిక హక్కు తమకు లేదని భాజపా అధ్యక్షుడు అమిత్ షా ఆ మధ్య పేద్ద ఉపన్యాసం ఇచ్చారు. మోడీ నిధులు ఇస్తున్నా, ముఫ్తీ నాయకత్వం విఫలమైందనీ, లోయలో శాంతి భద్రతలు లేకుండా పోయాయన్నారు. జమ్మూ కాశ్మీరులో విధ్వంసకర శక్తులు పెచ్చరిల్లుతున్నాయనీ, వారి ఆట కట్టించి తీరతామని అమిత్ షా అన్నారు.
ఇన్ని కబుర్లు చెప్పిన భాజపా పెద్దలు… ఇప్పుడు కాశ్మీరులో మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తున్నారంటే ఏమనుకోవాలి..? 87 అసెంబ్లీ స్థానాలున్న కాశ్మీరులో పీడీపీకి 28, భాజపాకి 25, నేషనల్ కాన్ఫరెన్స్ 15, కాంగ్రెస్ 12, పీపుల్స్ కాన్ఫరెన్స్ 2, మిగతావారు స్వతంత్రులున్నారు. అయితే, ఇప్పటికిప్పుడు భాజపా ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే 44 మంది ఎమ్మెల్యేల మద్దతు కావాలి. మిత్రులతో కలిపి మొత్తం 29 మంది భాజపాకి ఉన్న బలముంది. మరో 15 మంది మద్దతు కావాల్సి ఉంటుంది. ఆ మద్దతు ఎలా వస్తుందీ… అంటే, పీడీపీలో కొంతమంది అసంతృప్తులు ఉన్నారుగా! ముఫ్తీ వ్యవహార సరళిపై కొంతమంది గుర్రుగా ఉన్నట్టు సమాచారం. అయితే, అలాంటి గ్రూపును ప్రోత్సహించి పీడీపీలో చీలిక తెచ్చే అవకాశం ఉందా అంటే… భాజపా ప్రయత్నిస్తే ఎందుకు ఉండదూ అనేదే సమాధానం. రాష్ట్రంలో ప్రభుత్వ ఏర్పాటు సాధ్యాసాధ్యాలపై ఇప్పటికే కొంతమంది నేతలతో భాజపా అధికార ప్రతినిధి రామ్ మాధవ్ చర్చలు జరిపారని సమాచారం.
నిజానికి, గవర్నర్ పాలనతో కాశ్మీరులో ప్రస్తుతం పరోక్షంగా సాగుతున్నది భాజపా సర్కారే! మోడీ విజన్, హామీలూ అమలుకాని రాష్ట్రంలో ప్రతిపక్షంలో ఉండటమే బెటర్ అని అమిత్ షా చెప్పారు కదా! అలాంటప్పుడు, ఇప్పుడు మళ్లీ ప్రభుత్వ ఏర్పాటు కోసం ఎందుకు పాకులాడుతున్నట్టు..? మిత్రపక్షంగా తమ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకు పీడీపీపై నెపాన్ని నెట్టేసి… ఇప్పుడు అధికారం కోసం పాకులాడుతున్న తీరుని ఏమనాలి..? ఇతర రాష్ట్రాల పరిస్థితి వేరు.. కాశ్మీరు పరిస్థితి వేరు. దేశ భద్రతతో ముడిపడిన ప్రత్యేక రాష్ట్రం అది. అక్కడ కూడా ఫక్తు అధికార యావతో భాజపా ఆలోచిస్తున్న తీరు విస్మయానికి గురి చేస్తోంది. కాశ్మీరులో శాంతి నెలకొల్పడమే లక్ష్యమైతే, అది చేతగాలేదు కాబట్టే ముఫ్తీ సర్కారు నుంచి బయటకొచ్చామని చెప్పుకున్నాక… లోయలో సమస్యలపై దృష్టి పెట్టాలి. అభివ్రుద్ధిపై చర్యలుండాలి. అంతేగానీ… పీడీపీలో చీలిక సాధ్యమా, మరో ఇరవై మంది మద్దతు ఎలా వస్తుందనే చర్చలకు రామ్ మాధవ్ ని రంగంలోకి దింపడమేనా భాజపానా బాధ్యత అంటే..?