సినిమాలు వస్తుంటాయి, పోతుంటాయి. అందులో విజయాలు, ఘన విజయాలూ మామూలే. కానీ కొన్ని సినిమాలు మాత్రం చరిత్రలో మిగిలిపోతాయి. నెవ్వర్ బిఫోర్.. ఎవర్ ఆఫ్టర్ లాంటివన్నమాట. అలాంటి సినిమా మోహన్ బాబు ఖాతాలో ఏముందని వెదికితే.. పెద్ద పెద్ద అక్షరాలతో `పెదరాయుడు` కనిపిస్తుంది. మోహన్ బాబు కెరీర్ మొత్తాన్నే కాదు, ఇండ్రస్ట్రీలో కథల సరళిని కూడా ప్రభావితం చేసిన సినిమా ఇది. పెదరాయుడుకి ముందే.. ఇంత గొప్ప విజయాన్ని మోహన్ బాబు సాధించలేదు. దురదృష్టం ఏమిటంటే… ఆ తరవాత కూడా ఇంతటి ఘన విజయం ఆయన ఖాతాలో పడలేదు. ఈ సినిమాకి నేటితో పాతికేళ్లు పూర్తయ్యాయి.
పెదరాయుడు ఓ రీమేక్ కథ. తమిళంలో విజయవంతమైన `నాట్టమై`కి తెలుగు రూపం. ఈ సినిమాని రీమేక్ చేయమని మోహన్ బాబుకి సలహా ఇచ్చింది రజనీకాంత్. ఆయనే రీమేక్ రైట్స్ కొని మోహన్ బాబు చేతిలో పెట్టారు. అలా… ‘పెదరాయుడు’ సినిమా మొదలైంది. మెహన్ బాబు రెండు పాత్రల్లో కనిపించారు. పాపారాయుడుగా రజనీకాంత్ అదరగొట్టేశాడు. ఆ పాత్రే.. పెదరాయుడుకి హుందాతనాన్ని తీసుకొచ్చింది. భానుప్రియ, సౌందర్య కీలక పాత్రలు పోషించారు. `నాట్టమై` కథని తమిళంకంటే గొప్పగా తెరకెక్కించారు రవిరాజా పినిశెట్టి. కోటి స్వరాలు అదనపు బలాన్ని అందించారు. ‘కదిలే.. కాలమా.. కాసేపు ఆగవమ్మా’ పాటతే ఎవర్గ్రీన్ హిట్. ఈ సినిమాలోని డైలాగులన్నీ బాగా పాపులర్ అయ్యాయి. `ఫిష్ అండ్ వాటర్` డైలాగ్ ఇప్పటికీ వినిపిస్తూనే ఉంటుంది. దాన్ని ఎన్ని రకాలుగా పేరడీలు చేశారో. పాపారాయుడు డైలాగులన్నీ కంఠతా పట్టేశారు అప్పటి జనాలు. పెదరాయుడు తెలుగు సినిమాల కథలపై చాలా ప్రభావాన్ని తీసుకొచ్చింది. ఈ తరహా కథలు అప్పుడు వరస కట్టాయి. గ్రామ పెద్ద, వాళ్లిచ్చే తీర్పులు, కండువాలూ, పంచాయితీలూ.. వీటి చుట్టూ కథలు తిరిగేశాయి. ‘పెదరాయుడు’తో పాటు చిరంజీవి `బిగ్ బాస్` విడుదలైంది. తొలి రోజు జనాలంతా ‘బిగ్ బాస్’ కోసం ఎగబడ్డారు. దాంతో `పెదరాయుడు` థియేటర్లు బోసిబోయాయి, రెండో రోజు సీన్ మారిపోయింది. ‘బిగ్ బాస్’ అట్టర్ ఫ్లాప్ అయితే.. ‘పెదరాయుడు’ సూపర్ డూపర్ హిట్ అయిపోయింది. ఈ సినిమా ప్రభావం మోహన్‌బాబుపై చాలా కాలం ఉండిపోయింది. ‘రాయుడు’, ‘రాయలసీమ రామన్న చౌదరి’… ఇవన్నీ పెద రాయుడు ప్రభావంతో తెరకెక్కినవే. కానీ.. ఏదీ సరైన ఫలితాన్ని తీసుకురాలేదు. పెదరాయుడుని రీమేక్ చేయాలని విష్ణు భావించాడు. కానీ కుదర్లేదు. ఈ సినిమాకి రీమేక్ చేయలేమని, కావాలంటే.. సీక్వెల్ చేసుకోవచ్చన్నది మోహన్ బాబు అభిప్రాయం.