ఏపీ అధికార పార్టీలో బాగా నోరున్న నేత జోగి రమేష్ . జగన్ ను మెప్పించడానికి ఆయన ఎవరిపైనైనా ఎలాంటి పదాలతో అయినా విరుచుకుపడతారు. ఆయన అభిమానాన్ని అలాగే చూరగొని మంత్రి కూడా అయ్యారు. కానీ ఆయన ఓటమి భయంతో తన నియోజకవర్గాన్ని మార్చేసుకుంటున్నారు. ఓటమి అంచులో ఉన్నారని గుర్తించి నియోజకవర్గం మార్చేశారు సీఎం జగన్. పెడనను ఆయనను తప్పించారు. ఆయనను తప్పించి ఉప్పాల రాము అనే నేతను సమన్వయకర్తగా నియమించారు. మరి ఆ మార్పుతో అక్కడ పరిస్థితి మారిపోతుందా ?
జనసేన ఓట్ల చీలికతో గత ఎన్నికల్లో జోగి రమేష్ గెలుపు
ఉమ్మడి కృష్ణా జిల్లాలో పెడన నియోజకవర్గం కీలకమైనది. టీడీపీకి కంచుకోటగా ఉన్న నియోజకవర్గంలో గత ఎన్నికల్లో సీఎం జగన్ ప్రయోగం చేశారు. అది సక్సెస్ అయింది. 2019 ఎన్నికల్లో వైసీపీ తరపున జోగి రమేష్ పోటీ చేసి విజయం సాధించారు. ఆ ఎన్నికల్లో ఆయనకు 42 శాతం ఓట్లు పోలయ్యాయి. అయితే ఈ ఎన్నికల్లో జనసేన పోటీ చేయడంతో భారీ సంఖ్యలో ఓట్లు చీలాయి. దీంతో టీడీపీ అభ్యర్థి కాగిత కృష్ణ ప్రసాద్‌కు 37 శాతం ఓట్లు పోలయ్యాయి. తండ్రి కాగిత వెంకట రావు చరిష్మా, టీడీపీ సాంప్రదాయ ఓటు బ్యాంక్ ఆయనకు అండగా నిలిచింది. ఆయన కేవలం స్వల్ప మార్జిన్‌తో ఓటమిని చవి చూశారు. జనసేన తరపున అంకెం లక్ష్మీ శ్రీనివాస్ పోటీ చేసి ఏకంగా 17 శాతం ఓట్లు సంపాదించారు. నియోజకవర్గంలో అత్యధిక సంఖ్యలో ఉన్న కాపు సామాజిక ఓట్లు ఆయనకే పడ్డాయి. ఈ సారి ఎన్నికల్లో టీడీపీ, జనసేన కలిసి బరిలోకి దిగుతుండటం.. జోగి రమేష్ నియోజకవర్గం మారిపోయింది.
కాపు ఓటర్ల ఆధిక్యం
పెడన నియోజకవర్గంలో కాపులు, గౌడ్లు అధిక సంఖ్యలో ఉన్నారు. నియోజకవర్గంలో 31 శాతం కాపులు ఉన్నారు. వీరే డిసైడింగ్ ఫ్యాక్టర్‌గా ఉన్నారు. వీరిలో ఎక్కువగా టీడీపీ వైపు ఉంటూ వస్తున్నారు. 2019 ఎన్నికల్లో వీరి ఓట్లు ఎక్కువగా జనసేనకే పడ్డాయి. ఈ సారి జనసేన టీడీపీతో కూటమిలో ఉండటంతో వారి ఓట్లు ఆ పార్టీకే పడనున్నాయి. కాపుల తర్వాత అధిక సంఖ్యలో గౌడ సామాజిక వర్గ ఓటర్లు ఉన్నారు. మొత్తం 28 శాతం ఉన్న ఓటర్లలో వైసీపీ, టీడీపీ కూటమికి సమంగానే మద్దతు పలుకుతూ వస్తున్నారు. ఈ సారి జోగి రమేష్ కు టిక్కెట్ కేటాయించకపోవడంతో కొంత మంది ఓటర్లు మారిపోయే అవకాశం కనిపిస్తోంది. ఈ రెండు సామాజిక వర్గాల తర్వాత ఎస్సీ మాలలు 13 శాతం ఉన్నారు. వీరిలో అధికంగా వైసీపీకి మద్దతు పలుకుతున్నారు. 8 శాతం ఉన్న మత్స్యకారుల్లో జనసేనకు ఎక్కువ మొగ్గు కనిపిస్తోంది. టీడీపీకి కూడా సాంప్రదాయ ఓటర్లు ఉన్నారు.
ముందే గుర్తించిన జోగి రమేష్
స్థానిక ఎన్నికల్లో మంత్రి ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఓ జడ్పీటీసీ స్థానంలో వైసీపీ ఘోరంగా ఓడిపోయింది. పెడన జడ్పీటీసీగా టీడీపీ అభ్యర్థి ఆర్జా నగేష్ 644 ఓట్లతో గెలుపొందారు. పెడన జడ్పీటీసీ ఎన్నికను అత్యంత సవాల్ గా తీసుకున్నారు జోగి రమేష్. అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు. పోలింగ్ రోజుల వైసీపీ నేతలు దౌర్జన్యాలకు పాల్పడ్డారు. అయినా పెడన జడ్పీటీసీగా టీడీపీ గెలుపోదడంతో జోగి రమేశ్ కు షాక్ తగిలింది. అప్పట్నుంచి ఆయన తన నియోజకవర్గం మైలవరం కావాలని రాజకీయం చేశారు. కానీ .. ఆయనకు పెనుమలూరు కేటాయించారు. ఇప్పుడు మైలవరం ఎమ్మెల్యే వైసీపీకి దూరం కావడంతో అక్కడ దిగిపోవాలని అనుకుంటున్నారు. ఎన్నికల సమయానికైనా తానే అభ్యర్థిని అనుకుంటున్నారు.
పెడనలో పోలరైజేషన్ సిట్యూయేషన్
ఏపీలో ఈ సారి భిన్నమైన రాజకీయ పరిస్థితులు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా కృష్ణా జిల్లాలో ఓట్ల పోలరైజేషన్ పరిస్థితి కనిపిస్తోంది. టీడీపీ, జనసేన తరపున అందరూ గట్టిగా వైసీపీ ప్రభుత్వాన్ని సాగనంపాలన్న పట్టుదలతో ఉన్నారు. పవన్ పై వ్యక్తిగత విమర్శలు చేయడం.. చిరంజీవిని అవమానించడం వంటి వాటితో కాపులు ఎక్కువ అసంతృప్తిలో ఉన్నారు. ఆత్మగౌరవాన్ని దెబ్బకొట్టారన్న ఆగ్రహంతో ఉన్నారు ఇవన్నీ వైసీపీకి మైనస్ గా మారుతున్నాయి. పెడనలో టీడీపీ, జనసేనల్లో ఎవరు పోటీ చేసినా వారికి అడ్వాంటేజ్ గా మారే అవకాశం కనిపిస్తోంది.