అమరావతిలోని ఏపీ సచివాలయం గడచిన వారం రోజులుగా హడావుడిగా మారిన సంగతి తెలిసిందే. కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారాలు, శాఖల కేటాయింపులు, ఆయా శాఖల పేషీల్లోకి మంచి ముహూర్తాలు చూసుకుని, వేద పండితుల సమక్షంలో మంత్రుల ప్రవేశాలు… ఇలా సెక్రటేరియట్ పేషీల్లో హడావుడిగా ఉంది. ప్రభుత్వం మారిన తరువాత, గత ప్రభుత్వంలో ఏయే శాఖలకు ఏయే పేషీలున్నాయో… వాటిల్లోకి కొత్త మంత్రులు వెళ్లి, బాధ్యతలు స్వీకరిస్తారు. ఇది రొటీన్ గా జరుగుతుంది. మంత్రులు మారినా.. ఆయా శాఖలకు కేటాయించిన గదుల్లో మార్పులుండవు. అలానే ఇప్పుడు బాధ్యతలు తీసుకున్న మంత్రులందరూ వెళ్తున్నారు. కానీ, తనకు కేటాయించిన పేషీలోకి వెళ్లేందుకు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇష్టపడటం లేదట!
మంత్రిగా బాధ్యతలు స్వీకరించాక కొంతమంది సిద్ధాంతులను మాజీ మంత్రి లోకేష్ ఛాంబర్ కి తీసుకెళ్లారనీ, వాస్తుపరంగా కొన్ని ఇబ్బందులున్నాయని వారు చెప్పడం వల్లనే పెద్దిరెడ్డి ఆలోచిస్తున్నారనే ప్రచారం వైకాపా వర్గాల్లో ఉంది. అయితే, అసలు కారణం అది కాదనీ… ఆ ఛాంబర్ కి సెక్రటేరియట్ లో ఒక ముద్ర పడిపోయిందనీ, అలాంటి గుర్తింపు పొందిన ఛాంబర్ తనకు వద్దనేది మంత్రి మనోగతంగా తెలుస్తోంది. ఇంతకీ ఆ ముద్ర ఏంటంటే…. గత ప్రభుత్వ హయాంలో పంచాయతీ రాజ్ శాఖకు నారా లోకేష్ మంత్రిగా ఉండేవారు. ఆ సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఛాంబర్ తరువాత, ఎక్కువగా బిజీబిజీగా ఉండేది లోకేష్ ఛాంబరే. దాంతో ఆ ఛాంబర్ ని పంచాయతీరాజ్ శాఖామంత్రి పేషీ అనే కంటే, లోకేష్ పేషీగానే బాగా ప్రాచుర్యంలో ఉండేది.
ఇప్పుడు ప్రభుత్వం మారిన తరువాత కూడా సచివాలయ ఉద్యోగులు, ఇతర సిబ్బందీ ఆ ఛాంబర్ ని లోకేష్ ఛాంబరే అంటున్నారట! ఈ విషయం ఆనోటా ఈనోటా మంత్రిగారికి తెలిసింది. తాను ఆ పేషీలోకి వెళ్లినా… ఆయన లోకేష్ పేషీలో ఉన్నారని ఎవరైనా అంటే బాగోదు కదా అనేది మంత్రి అభిప్రాయంగా ఉందట! వైకాపాలో పెద్దిరెడ్డి కీలక నాయకుడు కాబట్టి, జనాల తాకిడి కూడా ఎక్కువగానే ఉంటుంది. అందుకే గత మంత్రి పేరుతో నోటెడ్ అయిన పేషీ వద్దని ఆయనే స్వయంగా చెప్పారట. దీంతో, ఉప ముఖ్యమంత్రి పుష్పా శ్రీవాణికి కేటాయిస్తున్నట్టు ఏపీ సర్కారు జీవో కూడా జారీ చేసేసింది.