ప్రభుత్వంలో కీలక మంత్రిగా ఉన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి తెలియకుండా… చిత్తూరు జిల్లాకు సంబంధించిన కీలక నిర్ణయాలు జరగవు. ముఖ్యంగా కుప్పం నియోజకవర్గానికి సంబంధించి అసలు జరగవు. ఎందుకంటే ఆ నియోజకవర్గం బాధ్యతలు ఆయనే తీసుకున్నారు. కుప్పానికి సంబంధించి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని అమలు చేయనివ్వబోమని… ఆదేశాలను వెనక్కి తీసుకుంటామని ఆయన చెప్పడం ఇప్పుడు ఆసక్తి రేపుతోంది. ఇటీవల పెద్దిరెడ్డితో వైసీపీ హైకమాండ్‌కు గ్యాప్ పెరిగిందన్న ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో నిర్ణయాలను నేరుగా జగన్ తీసుకుంటున్నారన్న చర్చ జరుగుతోంది. అందుకే అంతర్గత రాజకీయం ముదిరి పాకాన పడిందా అన్న చర్చ ఇప్పుడు వైసీపీలో నడుస్తోంది. కుప్పానికి సంబంధించి నిర్ణయాలు అత్యున్నత స్థాయిలోనే జరుగుతాయని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదంటున్నారు.
పెద్దిరెడ్డి వ్యతిరేకిస్తున్న ప్రభుత్వ నిర్ణయం రెస్కో అనే సంఘం విలీనం. రెస్కో అంటే రూరల్ ఎలక్ట్రిక్ కో-ఆపరేటివ్ సొసైటీ. ఏపీ మొత్తం మీద మూడు మాత్రమే ఉన్నాయి. ఈ రెస్కోలు గృహ, వ్యవసాయ, వాణిజ్య, పరిశ్రమల అవసరాలకు విద్యుత్తు సరఫరా చేస్తున్నాయి. తక్కువ ఫీజుకే కనెక్షన్లు ఇస్తున్నాయి. చిన్న సమస్య ఎదురైనా వెనువెంటనే పరిష్కరిస్తున్నాయి. మామూలుగా అయితే ఈ బాధ్యతలన్నీ అన్ని చోట్ల డిస్కమ్‌లు చేస్తాయి. అత్యంత మారుమూల ప్రాంతమైన కుప్పంలో వంద శాతం నాణ్యమైన విద్యుత్తు అందుతోందంటే దీనికి కారణం రెస్కోనే. అయితే ప్రభుత్వం ఇటీవల చిన్న చిన్న లోపాలను కారణంగా చూపి… డిస్కమ్‌లో విలీనం చేస్తూనిర్ణయం తీసుకుంది. అనకాపల్లి, చీపురుపల్లిల్లో ఉన్న మరో రెండు రెస్కోలను కూడా విలీనం చేసే అవకాశం ఉంది.
కుప్పం రెస్కో విలీనం వద్దని.. చంద్రబాబు సీఎస్‌గా లేఖ రాశారు. తక్షణం నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలన్నారు. కుప్పంలో రైతులు ప్రభుత్వ నిర్ణయంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. నిరనసలు చేపడుతున్నారు. డిస్కమ్‌లలో విలీనం చేస్తే.. తమకు మెరుగైన సేవలు లభించవని వారు ఆందోళన చెందుతున్నారు. దీంతో పెద్దిరెడ్డి నష్టనివరాణ చర్యలకు దిగినట్లుగా తెలుస్తోంది. రెస్కో ను విలీనం చేయబోమని ప్రకటనలు చేస్తున్నారు. ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నట్లుగా మాట్లాజుతున్నారు. నిజంగానే ఆయనకు తెలియకుండా నిర్ణయం తీసుకుని ఉంటే… నిర్ణయాన్ని ఆపడానికి కూడా ఆయన ఇబ్బంది పడాల్సి ఉంటుంది.